తమకు అనుకూలంగా మారుతున్న రాష్ట్రంగా బీజేపీ నమ్ముతున్న తెలంగాణపై ఆ పార్టీ ఫోకస్ మరింతగా పెరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ(BJP) జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. ఇందుకోసం ఢిల్లీలో తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ద్వారా దక్షిణాదిలో తమ పరిధిని విస్తరించుకోవడంతో పాటు తమకు వ్యతిరేకంగా మారుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు(KCR) చెక్ చెప్పాలనే భావనలో ఉంది బీజేపీ నాయకత్వం. ఇందుకోసం వచ్చే నెలలో మొదలుకాబోతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) రెండో విడత పాదయాత్రను వినియోగించుకునే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర ద్వారా అనేక మంది నేతల చేరికలు ఉండేలా బీజేపీ నాయకత్వం వ్యూహరచన సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. గతంలోనే బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి వెళ్లారు. బండి సంజయ్ పాదయాత్రకు మద్దతు తెలపడంతో పాటు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. అయితే బండి సంజయ్ తొలి విడత పాదయాత్రతో పోల్చితే.. రెండో విడతలో చేరికలు ఎక్కువగా ఉండేలా చూడాలని బీజేపీ యోచిస్తోంది.
ఇప్పటికే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బలమైన నాయకులు, సమర్థులైన నాయకుల జాబితాను రాష్ట్ర నాయకత్వం తమ కేంద్ర నాయకత్వానికి పంపినట్టు తెలుస్తోంది. వీరిని చేర్చుకోవడం వల్ల ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని.. ఎక్కడెక్కడ బీజేపీకి చెక్ చెప్పొచ్చనే వివరాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో అందజేసినట్టు సమాచారం.
KCR | Rahul Gandhi: కేసీఆర్ వ్యూహంలో వేలు పెడుతున్న కాంగ్రెస్.. సరికొత్త వ్యూహం ?
Telangana : పెరిగిన భూముల ధరలు... నేషనల్ హైవేలకు అడ్డంకిగా రైతుల ఆందోళనలు..
వీరిలో పలువురు నేతలను చేర్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వం కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అయితే పాదయాత్ర సందర్భంగా నేతల చేరికలు ఎక్కువగా ఉండటం వల్ల.. ఆ ప్రభావం పార్టీ ఎదుగులతో పాటు తెలంగాణ రాజకీయాలపై ఉంటుందనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. అందుకే ఈసారి బండి సంజయ్ పాదయాత్ర గతంతో పోల్చితే మరింత ప్రభావం చూపేలా ఉండేందుకు పక్కా బ్లూప్రింట్ సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.