తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుని తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇందుకోసం అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకోసం బీజేపీ కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఆ పార్టీ ముఖ్యనేత అమిత్ షా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారనే వాదన కూడా ఉంది. తనకు అందిన నివేదికల ఆధారంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఆయన నిర్ణయాలు, చర్యలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక యూపీలో(Uttar Pradesh) పార్టీ బలోపేతం, గెలుపు కోసం పని చేసిన సునీల్ బన్సల్... కొన్ని నెలల క్రితం తెలంగాణలో పార్టీ గెలుపు బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.
నాయకులెవరు వచ్చి తనతో మాట్లాడినా.. అన్నీ ఓపిగ్గా వింటూ వచ్చారు బన్సల్. యూపీలో బీజేపీని గెలిపించిన బన్సల్.. తెలంగాణలోనూ ఆ సీన్ రిపీట్ చేస్తారా ? అని బీజేపీ నేతలు ఆసక్తిగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలు ఏం చేయాలనే దానిపై సునీల్ బన్సల్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న బన్సల్.. తెలంగాణ బీజేపీ నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు చెప్పడాన్ని సునీల్ బన్సల్(Sunil Bansal) తప్పుబట్టారని సమాచారం. రాజకీయ నేతలు రాజకీయాలే చేస్తారని వారికి చెప్పారని.. అందరూ అదే చేస్తారని చెప్పడంతో నేతలు షాక్ అయ్యారట. గాలిలో కాకుండా గ్రౌండ్‌లో దిగి పని చేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేయడంతో.. తెలంగాణలో ఇకపై పని చేయని బీజేపీ నేతలకు పెద్దగా గుర్తింపు ఉండదనే చర్చ జరుగుతోంది.
Telangana: గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..ఆ విషయంలో ధన్యవాదాలు చెబుతూ ట్వీట్
ఎవరు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని.. బూత్ స్థాయిలో పని చేస్తున్న నేతలు ఎంతమంది అనే దానిపై సునీల్ బన్సల్ ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేశారని సమాచారం. మొత్తానికి ఇంతకాలం తెలంగాణ బీజేపీలో పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన సునీల్ బన్సల్.. ఇప్పుడు రాష్ట్ర పార్టీలో తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.