ఢిల్లీ(Delhi)లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్(KCR) ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయంటూ తెలంగాణ(Telangana)కు చెందిన బీజేపీ నేతలు మరోసారి ఆరోపణలు చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ను అరెస్ట్ చేసి పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపడుతూ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్(Jeevitharajashekar) కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు లిక్కర్ స్కాంలోనే కాదు చాలా స్కామ్‌లలో వాటాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల లెక్క చెప్పాలన్న జీవిత ప్రజలు టీఆర్‌ఎస్ నిరంకుశపాలనను గమనిస్తున్నారని సరైన టైమ్‌లో తగిన గుణపాఠం చెబుతారని కామెంట్ చేశారు.
అన్నీ స్కాంలలో వాటాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై బీజేపీ నేత, ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.ఢిల్లీలో ఎక్సైజ్ కుంభకోణంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణలపై జీవిత స్పందిస్తూ.. ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు నిజం మాట్లాడే దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిర్బంధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికీ నిరంకుశ పాలన సాగుతోందని ఆమె అన్నారు. ప్రభుత్వ తప్పులను ఎవరైనా వేలెత్తి చూపించిననా , ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా సెక్షన్లు మార్చుకుంటూ బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు జీవిత.
వేల కోట్ల ఆస్తుల లెక్కేంటి..?
నిజంగా లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేనప్పుడు కేసీఆర్ ఎందుకు ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడటం లేదని ప్రశ్నించారామె. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తుల లెక్కలు చెప్పాలన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాధించారో అందరికి తెలుసని జీవిత ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతి పబ్, క్లబ్, బార్, మల్టీప్లెక్సులో మంత్రి కేటీఆర్‌కి వాటా ఉందన్నారు జీవిత. అంతే కాదు ఈ విషయాన్ని పబ్‌లు, క్లబ్‌లు, బార్ యజమానులే తనకు చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన ఆరోపణలను జీవిత తన వాదనతో సమర్థించుకున్నారు.
ప్రజలు గమనిస్తున్నారు..
ప్రజలను తక్కువ అంచనా వేస్తున్న కేసీఆర్ కుటుంబానికి తమ పరిస్థితి ఏమిటో అర్ధమైందన్నారు జీవిత. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే భయంతోనే బీజేపీ శ్రేణులపై దాడులు, అరెస్ట్‌లు, అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. అన్నీ స్కాంలపై కేంద్ర ప్రభుత్వం బయటపెడుతుందని జీవిత చెప్పారు.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నిరసన దీక్ష కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్, బీజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మురళీధర్‌రావు, విజయశాంతి, జీవిత పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Jeevitha rajasekhar, Telangana Politics