తెలంగాణలో ఎలాగైనా గెలవాలి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ జెండా ఎగరాలి. ఇదే ఇప్పుడు బీజేపీ ముందున్న ఆలోచన. ఇందుకోసం ఏం చేయాలన్నది దానిపై బీజేపీ నాయకత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో గోవా మోడల్‌ను(Goa Model) అమలు చేసేందుకు బీజేపీ (BJP) జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ (Telangana) బీజేపీలో గోవా మోడల్ గురించి చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారు. గెలిచే అభ్యర్థిని గుర్తించి పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం.. అవసరమైతే గెలిచే అవకాశం ఉన్న వారి కుటుంబసభ్యులకు కూడా టికెట్ ఇవ్వడం అన్నదే ఈ గోవా మోడల్. గోవాలో ఈ మోడల్ బాగా వర్కవుట్ అయ్యిందట.
అందుకే తెలంగాణలోనూ ఈ ప్లాన్ అమలు చేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం పచ్చజెండా ఊపినట్టు సమాచారం. నిజానికి బీజేపీలో టికెట్ల కేటాయింపు విషయంలో అనేక సంప్రదాయాలు పాటిస్తారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే అలాంటి వ్యక్తులకు గెలిచే అవకాశం లేకపోతే టికెట్లు ఇచ్చి ఏం లాభమనే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి వచ్చిందట. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను సర్వే ద్వారా కనిపెట్టి వారిని పార్టీలోకి తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
అందుకే బీజేపీలోకి వచ్చే వాళ్లెవరినీ అడ్డుకోవద్దని.. స్థానిక నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఈ చేరికల అంశాన్ని వేరే ఇతర నేతల ద్వారా ఖరారు చేయాలని.. వాళ్లు ఖరారు చేసిన నేతలను కచ్చితంగా పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. అంతేకాదు తమతో పాటు తమ కుటుంబసభ్యులకు కూడా టికెట్లు ఇస్తేనే బీజేపీలోకి వస్తామనే నేతలు చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు బీజేపీ సంప్రదాయాలు అడ్డొస్తాయనే ఉద్దేశ్యంతో వారికి పార్టీ నేతలు నో చెబుతున్నారు.
Telangana: బండి సంజయ్ లెక్క.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS కు ఎన్ని స్థానాలు వస్తాయంటే.. ?
Telangana Politics: TRS నాయకులతో ఈటల టచ్..? మీడియా సమావేశంతో తేటతెల్లం.. వివరాలివే
అయితే తమ సర్వేలో నేతలు, వారి కుటుంబసభ్యులు కూడా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని తేలితే.. వారికి కూడా టికెట్లు ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉందని.. ఈ విషయంలో గత సంప్రదాయాలను పక్కనపెట్టాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందని చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో కచ్చితంగా గెలవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీ.. ఈ విషయంలో తమకు అడ్డుగా ఉన్న అంశాలను, రూల్స్‌ను పక్కనపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.