TS POLITICS BJP HIGH COMMAND SERIOUS ON STATE LEADERS REGARDING NEW JOININGS IN PARTY AK
BJP: చేరికలపై బీజేపీ హైకమాండ్ సీరియస్.. ఇకపై అలా కుదరదని క్లారిటీ
అమిత్ షా, మోదీ, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
Telangana| BJP: పార్టీలోకి కొత్త వాళ్లు వస్తారని.. అంతా కలిసి పని చేయాలని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని బీఎల్ సంతోష్ వంటి నేతలు గతంలోనే తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పారు.
తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని ధీమాగా ఉన్న ఆ పార్.. అందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తోంది. అయితే ఇంత చేస్తున్నా.. బీజేపీలో చేరికలు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఆ పార్టీ దూకుడు, విజయాలతో పోల్చితే.. బీజేపీలో చేరే నాయకుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. గతంలో పార్టీలో చేరిక కోసం సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి సారథ్యంలో ఓ కమిటీ వేసిన బీజేపీ.. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajendar) సారథ్యంలో ఇందుకోసం మరో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే చేరికల విషయంలో తమ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ(Telangana) బీజేపీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారని.. అయితే రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు పరిణామాలు వారికి అనుకూలంగా ఉంటేనే చేరికలు ప్రొత్సహిస్తున్నారనే వాదన ఉంది.
పార్టీలోకి కొత్త వాళ్లు వస్తారని.. అంతా కలిసి పని చేయాలని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని బీఎల్ సంతోష్ వంటి నేతలు గతంలోనే తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పారు. అయినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదని.. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ఒక్క మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మినహా ఎవరూ బీజేపీలో చేరలేదు. విశ్వేశ్వర్ రెడ్డి సైతం బీజేపీ నేతల స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన తరువాత ఇందుకు ఓకే చెప్పారు.
అయితే తాజాగా ఈ అంశంపై బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరే వారిని చేర్చుకోవాలని.. ఈ విషయంలో రాష్ట్ర నేతలు ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని సూచించింది. ఒకవేళ పార్టీలో చేరాలనుకునే నేతల విషయంలో రాష్ట్ర నేతలకు ఏకాభిప్రాయం కుదరకపోతే.. ఆ అంశాన్ని తమ దృష్టికి తీసుకురావాలని బీజేపీ పెద్దలు స్పష్టం చేసినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ నేతలకు బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నారు.
కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే.. వెంటనే తమ దృష్టికి తీసుకు వస్తే ఏం చేయాలో తాము నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీలోకి చేరికలు పెరిగితే.. పార్టీ మరింత బలోపేతమవుతుందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతుందనే భావనలో ఉన్న బీజేపీ నాయకత్వం.. ఇకపై ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. పార్టీలో చేరికల కోసం బీజేపీ వేసిన కొత్త కమిటీ.. ఏ మేరకు తమ బాధ్యతలను నిర్వహించడంలో సక్సెస్ అవుతుందో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.