తెలంగాణ(Telangana)లో పాగా వేయాలని..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్న బీజేపీBJP) అందుకు తగినట్లుగానే ఎన్నికల యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్‌ని రెడీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర కమలం నేతలకు అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఎలక్షన్ టైమ్ వచ్చింది...దూకుడు పెంచాల్సిందేనంటూ పార్టీ శ్రేణుల్ని, రాష్ట్ర నాయకత్వాన్నిఅలర్ట్ చేస్తోంది. రానున్న ఐదు నెలల్లో రాష్ట్రంలో బీజేపీ చేపట్టబోతున్న కార్యక్రమాలు, ప్రణాళికలపై నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
అసెంబ్లీ ఎలక్షన్ హీట్..
మరో ఐదు నెలల పాటు పార్టీ శ్రేణులు ఎవరూ కాళీగా ఉండకుండా బీజీ ప్రోగ్రామ్‌ని ఫిక్స్ చేయడంతో పాటు నేతలు, పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకోవాలని నేతలకు సూచిస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందులో భాగంగానే రాబోయే ఐదు నెలల్లో 15రోజులకు ఒక భారీ బహిరంగ సభ ఉండేలా..వాటికి ప్రధాని మోదీ , హోంమంత్రి అమిత్‌షాతో పాటు యోగీ ఆధిత్యనాథ్ వంటి కీలక నేతలు పాల్గొనేలా పక్కా ఎన్నికల వ్యూహాన్ని రచించింది.
ఎన్నికల సమరమే ..
తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేసేందుకు బీజేపీ జాతీయ నాయకులు ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో రాబోయే 5నెలల పాటు పార్టీ నేతలు ఎలా ముందుకెళ్లాలి..? పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై రాష్ట్ర అధినాయకత్వానికి, శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తేది నుంచి పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. 25వ తేదీలోగా 11వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలంటోంది. అంటే ప్రతి రోజు 600కుపైగా వీధి సమావేశాలు అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6లోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నిర్వహించే ఈకార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు పాల్గొనాలని సూచిస్తోంది.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్లాన్..
క్షేత్రస్థాయిలోనే కాదు పట్టణ, నగరాల్లో కూడా పార్టీ శ్రేణుల్ని రేసుగుర్రాల్లా పరిగెత్తించేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపే 10భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసింది బీజేపీ. ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు కీలక నేతలు కూడా రాష్ట్రంలో నాలుగు, ఐదు సార్లు పర్యటించేలా బహిరంగ సభలకు ప్రణాళిక, ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర అధినాయకత్వాన్ని ఆదేశించింది. బూత్ స్థాయి కమిటీలతో పాటు మండల, జిల్లా స్థాయి కమీటీలను ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి జిల్లాకు సుమారు లక్ష మంది కార్యకర్తలు ఏర్పడతారని ఎన్నికల ప్రచారంలో కొంత హడావుడి కనిపిస్తుందని పేర్కొంది.
బిజీ షెడ్యూల్ ..
అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ...పాదయాత్రల పేరుతో కాలయాపన చేసి విజయాన్ని చేజార్చుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని తెలుపుతోంది. బైక్ ర్యాలీలు, రథయాత్రలతో రాజకీయ వేడితో పాటు ఎన్నికల హడావుడిని క్రియేట్ చేయాలంటోంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యేలా పక్కా ప్రణాళికను రూపొందించుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కార్యవర్గానికి జాతీయ నేతలు సూచించడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా .. ఏం చేస్తే అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని తమ ఖాతాలో వస్తాయో అవన్నీ చేయాలని గట్టిగా చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Telangana Politics