తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) జాతీయ పార్టీ స్థాపనలో బిజీగా ఉండగా, స్థానికంగా అధికార టీఆర్ఎస్ (TRS) కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి (Vijaya Reddy) కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికీ ఆమె సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతుండగా, జంటనగరాల రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తోన్న పీజేఆర్ కుటుంబం పూర్తిగా తిరిగి సొంతగూటికి చేరుతున్నట్లయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విజయారెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. వివరాలివే..
గ్రూపు తగాదాలు, సరైన ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి కారణాలతో కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి.. శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ నిరసనలపై రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన ఇంట్లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టగా, ఆయనతో కలిసి విజయారెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
‘‘నాన్న పీజేఆర్ సీఎల్పీ లీడర్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. పార్టీలోనే మరణించారు. కాంగ్రెస్ తో మాది విడదీయలేని బంధం. మర్యాదపూర్వకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశాను. దేశంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం. మా కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉంది. ఇకపైనా కాంగ్రెస్‌తోనే బాగుంటుంది. అందరితో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నా. నాన్న పీజేఆర్ బాటలో నడుస్తా’’ అని విజయా రెడ్డి వెల్లడించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ విజయారెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈసారి మేయర్ పీఠం మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెనే మేయర్ అవుతారని విస్తృతంగా ప్రచారం జరిగినా, చివరికి ఆమెకు నిరాశే మిగిలింది. పదవి దక్కలేదని అలకవహించిన ఆమెను ఎలాగోలా బుజ్జగించి మేయర్ ఎన్నికల్లో భాగస్వామిని చేశారు టీఆర్ఎస్ నేతలు.
సొంత పార్టీ తీరుతో అసంతృప్తిగా ఉన్న విజయారెడ్డి.. ఏక్షణమైనా అసెంబ్లీ ఎన్నికలు రావచ్చనే అంచనాతో కాంగ్రెస్ లో చేరికను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ తర్వాత గొప్ప నేతగా ఇమేజ్ కలిగిన దివంగత పీజేఆర్ కూతురు తిరిగి కాంగ్రెస్ లో చేరడం సిటీలో బూస్ట్ అవుతుందని పార్టీ భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Revanth Reddy