ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రాజకీయంగా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు వారాల్లో జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతు తీసుకున్న టీఆర్ఎస్... ఆ పార్టీ ఓటు బ్యాంకు తమకు కొంతమేర కలిసొస్తుందని ధీమాగా ఉంది. ఇందుకోసం టీఆర్ఎస్ సీనియర్ నేత స్వయంగా సీపీఐ నేతలను కలిసి చర్చలు జరిపారు. దీంతో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు సీపీఐ అంగీకరించింది. ఈ సమయంలోనే ఆర్టీసీ సమ్మె అంశం తెరపైకి రావడంతో... ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీపీఐ హుజూర్ నగర్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశంపై వెనక్కి తగ్గొచ్చని పలువురు భావించారు.
అయితే అది రాజకీయపరమైన అంశమని సీపీఐ ప్రకటించడంతో... హుజూర్ నగర్లో టీఆర్ఎస్ సీపీఐ దోస్తీకి వచ్చిన ముప్పేమి లేదని చాలామంది భావించారు. కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో టీఆర్ఎస్ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో... ఆ ఎఫెక్ట్ హుజూర్ నగర్లో టీఆర్ఎస్ సీపీఐ మైత్రిపై పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపద్యంలో టిఆర్ఎస్కు మద్దతు ఇచ్చే విషయాన్ని పునరాలోచించుకుంటామని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తాము ఎప్పుడైనా కార్మికుల పక్షానే ఉంటామని ఆయన అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్దృతం కాకముందు తాము హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించామని... ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు,పరిణామాలను గమనంలోకి తీసుకుని తమ కమటీ సమావేశం అయి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇది దొరల రాజ్యం కాదని, ప్రజాస్వామ్యం అని ఆయన అన్నారు.ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని కేసీఆర్ అనడం, దారుణం అని , ఆయనే సెల్ప్ డిస్మిస్ చేసుకుంటున్నాడని చాడ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఎపిలో ప్రభుత్వంలో విలీనం చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ దోస్తీ ప్రమాదంలో పడినట్టే అనే ప్రచారం మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, CPI, Huzurnagar bypoll 2019, Telangana, TSRTC Strike