వివాదాస్పద వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఈసారి ఆయనపై బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయ్యింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత(BJP LP Leader) పదవి కూడా పోయింది. ఒకవేళ ఆయనను బీజేపీ మళ్లీ పార్టీలోకి తీసుకున్నా.. శాసనసభాపక్ష నేత పదవి మాత్రం ఆయనకు దక్కే అవకాశాలు లేవన్నది పలువురి విశ్లేషణ. ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పలుసార్లు గెలిచింది.
దుబ్బాకలో(Dubbaka) బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందన్ రావు(Raghunandan Rao), హుజూరాబాద్‌లో(Huzurabad) కమలం పార్టీ తరపున బరిలోకి దిగిన ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్పై విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచినా.. శాసనసభాపక్ష నేతగా మాత్రం రాజాసింగ్ కొనసాగుతూ వస్తున్నారు. అయితే రాజాసింగ్ ఆ పదవిలో ఉండగానే.. మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ పదవిని ఆశించినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆయన పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
రాజాసింగ్‌కు తెలుగు భాషపై పట్టు లేకపోవడంతోపాటు వివిధ అంశాలపై అవగాహన లేకపోవడంతో శాసనసభాపక్ష నేతగా తనకు అవకాశం ఇవ్వాలని రఘునందన్ రావు పార్టీ నేతలను కోరినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆయన ఆశించినట్టు జరగలేదు. అయితే తాజాగా రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఆయన స్థానంలో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికప్పుడు ఈ పోస్టులో ఎవరో ఒకరిని నియమించాల్సిన అవసరం బీజేపీకి లేకపోయినా.. ఎవరో ఒకరికి ఆ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రఘునందన్ రావు, ఈటల రాజేందర్లో ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందా ? అని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana: కాంగ్రెస్ హైకమాండ్‌తో ఎంపీ కోమటిరెడ్డి కీలక భేటీ.. అసంతృప్తికి ఫుల్స్టాప్ పడుతుందా ?
Politics: పెళ్లిళ్లే ‘‘రాజకీయ వేదికలు’’.. బడా నేతల ఇళ్లల్లో మోగిపోతున్న బాజాలు
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో ఉండబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే.. ఆయన పేరును కూడా శాసనసభాపక్ష నేత పదవికి పరిశీలించే అవకాశం లేకపోలేదనే కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ పదవిపై గతంలోనే ఆశలు పెట్టుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకే బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం దక్కొచ్చని అంటున్నారు. మొత్తానికి బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌తో తెలంగాణలోని ఆ పార్టీలో శాసనసభాపక్ష నేతకు సంబంధించి అప్పుడే కొత్త చర్చ మొదలైనట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Raja Singh, Telangana