తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పోటీ చేయబోతున్న అసెంబ్లీ స్థానం అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) చుట్టే బండి తిరుగుతుండడంతో జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి బీజేపీ చీఫ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మొదట వేములవాడ ఆ తరువాత సిరిసిల్ల పేరు బలంగా వినిపించగా..తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది.
కరీంనగర్ ఎంపీగా గెలిచినా బండి సంజయ్ (Bandi Sanjay) కు జిల్లా వ్యాపంగా పట్టుంది. ఈ మేరకు ఆయన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే..కరీంనగర్ సమస్యలపై బండి సంజయ్ (Bandi Sanjay) చురుకుగా స్పందిస్తారు. ఎప్పటికప్పుడు జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసే దిశగా చూస్తారు. అంతేకాదు గతంలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది. అయితే ఆ సమయంలో గంగుల కమలాకర్ చేతిలో బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
బండి పోటీ తప్పనిసరి.ఎందుకంటే..
కాగా రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విల్లూరుతుంది. ఈ క్రమంలో బండి సంజయ్ (Bandi Sanjay) పోటీ తప్పని సరైంది. అందుకే కరీంనగర్ నుండి పోటీ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి. అలాగే అక్కడ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ను ఓడించాలంటే బండి సంజయ్ (Bandi Sanjay) సరైన వ్యక్తి అని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి బండి సంజయ్ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఇక కరీంనగర్ నుండి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై సర్వే కూడా చేయించినట్లు తెలుస్తుంది. ఆ సర్వేలో కరీంనగర్ నుంచి పోటీ చేస్తేనే సత్పలితాలు వస్తాయని తేలినట్లు సమాచారం.
అప్పుడు బండి ఓటమి..ఈసారి..
గతంలో కరీంనగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ (Bandi Sanjay) ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గంగులకు 80 వేల పైచిలుకు ఓట్లు రాగా..బండి సంజయ్ కు 66 వేల ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 30 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. అయితే అప్పటి ఓటమి సెంటి మెంట్ ఇప్పుడు బండి సంజయ్ (Bandi Sanjay) కు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే కరీంనగర్ స్థానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Karimnagar, Telangana