హోమ్ /వార్తలు /తెలంగాణ /

PM Modi | Hyderabad : మోదీ సభలోనే బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. వంశ చరిత్రను అలా..

PM Modi | Hyderabad : మోదీ సభలోనే బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. వంశ చరిత్రను అలా..

ప్రధాని మోదీ, మాజీ ఎంపీ కొండా (పాత ఫొటోలు)

ప్రధాని మోదీ, మాజీ ఎంపీ కొండా (పాత ఫొటోలు)

తెలంగాణ గడ్డపై జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు కనీవినీ ఎరుగని రీతిలో హడావిడి చేస్తున్నా స్థానికంగా చెప్పుకోదగ్గ చేరికలేవీ చోటుచేసుకోకపోవడం లోపంగా మారింది. దాన్ని పూడ్చుకుంటూ తెలంగాణ చరిత్రలో పేరున్న కుటుంబానికి చెందిన నేతను కమలదళంలో కలుపుకోనుంది..

ఇంకా చదవండి ...

ఇప్పుడున్నవి మూడు సీట్లే అయినా తెలంగాణలో వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామంటోన్న బీజేపీ తన జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ ను ఎంచుకోవడం, ఆ మేరకు భారీ హంగామా నెలకొనడం తెలిసిందే. రాష్ట్ర బీజేపీ నేతలు కనీవినీ ఎరుగని రీతిలో హడావిడి చేస్తున్నా స్థానికంగా చెప్పుకోదగ్గ చేరికలేవీ చోటుచేసుకోకపోవడం లోపంగా మారింది. కొద్దోగొప్పో పేరున్న నేతలంతా వరుసగా కాంగ్రెస్ లోకి చేరుతుండటం కమలనాథులకు ఇబ్బందికరంగా మారింది. అయితే, తెలంగాణ చరిత్రలో పేరుమోసిన కుటుంబానికి చెందిన నేత ఒకరు కమలతీర్థం పుచ్చుకోడానికి సిద్ధం కావడంతో ఆయనను ప్రధాని మోదీ సమక్షంలోనే పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది.

తెలంగాణ తొలితరం రాజకీయ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసి, ఒక జిల్లాకే ఆయన పేరు పెట్టేంత ఘనత పొందిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరే ముహుర్తం దాదాపుగా ఖరారైంది. హైదరాబాద్ వేదికగా బీజేపీ అట్టహాసంగా నిర్వహిస్తోన్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రం నుంచి కొండాదే అతిపెద్ద చేరిక కానుంది.

Price Hike : పెరుగు ప్యాకెట్, మాంసంపైనా జీఎస్టీ బాదుడు.. రేట్లు పెరిగే వస్తు, సేవలు ఇవే..


ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా జూలై 3న బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న విజయ్‌ సంకల్ప్‌ సభా వేదికపైనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. బీజేపీలో చేరే అంశంపై గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేస్తానని విశ్వేశ్వర్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు.

TRS | BJP : బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్.. జాతీయ భేటీ, మోదీ సభ వేళ ఎటుచూసినా కేసీఆర్!


జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా భారీగా చేరికలకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నా పెద్దగా స్పందన రావడంలేదు. అయితే కొండా విషయంలో మాత్రం మొగ్గు కనిపించింది. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ బుధవారం నాడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. వారి మధ్య చర్చలు సఫలమైనట్టు తెలిసింది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాతగారైన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా (1978లో) ఏర్పాటు కావడం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ప్రజల్లో ఇప్పటికీ కొండా కుటుంబం పట్ల ఆదరణ కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2013లో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ తొలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. కేసీఆర్ తో విభేదాల కారణంగా 2018లో ఆయన కాంగ్రెస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిన రెండేళ్లకు అంటే, 2021లో ఆ పార్టీ నుంచి కూడా బయటికొచ్చేసిన కొండా ఇప్పుడు బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నారు. సభావేదికపై కొండా కుటుంబ రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ స్వయంగా విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటారని తెలుస్తోంది.

First published:

Tags: Bjp, Hyderabad, Konda Vishweshwar reddy, Pm modi, Telangana

ఉత్తమ కథలు