TS POLITICS AFTER 8 YEARS CONGRESS RAHUL GANDHI TRS KTR FACE TO FACE AT YASHWANT NOMINATION TRS WP RESIGNATION CHALLENGE TO CENTRE MKS
Rahul Gnadhi | KTR : 8 ఏళ్ల తర్వాత ఎదురుపడ్డ కాంగ్రెస్, టీఆర్ఎస్ అగ్రనేతలు.. సంచలన సవాల్
సిన్హా నామినేషన్ సందర్భంగా ముందు వరుసలో రాహుల్, కేటీఆర్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలో విరోధులైన టీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రనేతలు కలిసి హాజరయ్యారు. 8 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ, కేటీఆర్ ప్రత్యక్షంగా ఎదురుపడ్డారు..
రాష్ట్రపతి ఎన్నికల (Presidential polls 2022) నామినేషన్ల సందర్భంగా ఇవాళ పార్లమెంటు భవనంలో అరుదైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేయగా, ఈ కార్యక్రమానికి తెలంగాణలో విరోధులైన కాంగ్రెస్, టీఆర్ఎస్ అగ్రనేతలు కలిసి హాజరయ్యారు. నిత్యం విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, 8 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR)ప్రత్యక్షంగా ఎదురుపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీలోని అధికార పార్టీ వైసీపీ, ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ, మాయవతి బీఎస్పీ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. అయినప్పటికీ, సైద్ధాంతికంగా మోదీ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ రెండు పదలకుపైగా విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాయి. అయితే, ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తోన్న దాదాపు 23 పార్టీల్లో చాలా వరకు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉండటం గమనార్హం. అందునా, తెలంగాణలో విరోధులైన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకేతాటిపైకి రావడం చర్చనీయాంశమైంది.
యశ్వంత్ నామినేషన్ ప్రక్రియలో రాహుల, కేటీఆర్, తదితరులు
యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. ఇవాళ పార్లమెంటు భవనంలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎన్సీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ, డీఎంకే తదితర పార్టీల నేతలతో కలిసి గడిపారు. రాహుల్ గాంధీ, కేటీఆర్ ఎదురుపడటం గత ఎనిమిదేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సామూహిక గౌరవప్రద నమస్కారాలు తప్ప ఇద్దరు నేతలు విడిగా ముచ్చటేదీ పెట్టుకోలేదు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆ ఖ్యాతి సోనియా గాంధీకే దక్కుతుందని బహిరంగ ప్రకటన చేసిన కేసీఆర్.. కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి గాంధీ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ సందర్భంలో రాహుల్ కూడా ఉన్నప్పటికీ, ఫొటో సెషన్ లో మాత్రం ఆయన పాల్గొనలేదు. తెలంగాణ ఏర్పడ్డ కొద్దిరోజులకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తమవైపునకు తిప్పుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య వైరం ఏర్పడింది. అది క్రమంగా పెరుగుతూ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. రాహుల్ గాంధీ బఫూన్ అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చాలా సార్లు విమర్శించారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నంలోనూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తి కాబోదనే వాదనలో భాగంగా రాహుల్ గాంధీ నాయకత్వపటిమపైనా తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ డిక్లరేషన్ సందర్భంలో మంత్రి కేటీఆర్ సైతం రాహుల్ గాంధీని చీల్చి చెండాడారు. రాహుల్ గాంధీ మాత్రం.. సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోదన్న ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా విమర్శలేవీ చేయలేదు. మాటల సంగతి ఎలా ఉన్నా, కాంగ్రెస్, టీఆర్ఎస్ అగ్రనేతలు మళ్లీ ఇన్నాళ్లకు ఎదురుపడిన సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల వేళ ఏర్పడింది. ఇదిలా ఉంటే,
ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేసన్ దాఖలు అనంతరం టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన సవాలు విసిరారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన దానికంటే రాష్ట్రానికి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాలు చేశారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.