తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (సీఎం కేసీఆర్) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో సోమవారం నాడు వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రగతి భవన్ నుంచి వెలువడిన సమాచారం ప్రకారం..
తెలంగాణలో ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సెలవులను ప్రకటించేలా చర్యలు చేపట్టాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. అయితే, ఇవి సంక్రాంతి సాధారణ సెలవులా లేక ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇచ్చిన ప్రత్యేక సెలవులా అనేదిచర్చనీయాంశమైంది.
తెలంగాణ సర్కారు ప్రకటించిన సెలవులు మొదలయ్యే 8వ తేదీన రెండో శనివారం, 9న ఆదివారం, 11 నుంచి 16 వరకు ముందుగానే నిర్దేశించిన సంక్రాంతి సెలవులు. అంటే సోమవారం(10వ తేదీ) ఒక్కటే అదనంగా దక్కిన సెలవు అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఆరోగ్య శాఖ సమీక్షలో సెలవుల నిర్ణయం తీసుకోవడంతో ఒమిక్రాన్ నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.