TS ASSEMBLY RECALLS PRANAB MUKHERJEES ROLE IN TELANGANA STATE FORMATION
మాజీ రాష్ట్రపతి ప్రణబ్, రామలింగారెడ్డికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం
తెలంగాణ సీఎం కేసీఆర్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనసభ ప్రగాఢ సంతాపం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలను స్మరించుకుంది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనసభ ప్రగాఢ సంతాపం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలను స్మరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రణబ్ మరణం పట్ల సంతాపం తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడిన సీఎం కేసీఆర్...ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సభ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ పేరు లేని పేజీ ఉండదని కొనియాడారు. బెంగాల్‌లోని చిన్న గ్రామంలో పుట్టారు, భారత మాత ప్రియపుత్రుడుగా ఎదిగారు, జఠిల సమస్యలు పరిష్కరించడంలో ఆయన నేర్పరి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తూ మాట్లాడిన మంత్రి ఈటెల..తెలంగాణ అంశాన్ని యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చడంతో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రణబ్‌ను సీఎం కేసీఆర్ ఎప్పుడూ పితృసమానులుగా చూశారని అన్నారు. ప్రణబ్ తన పుస్తకంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గురించి రాసారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రణబ్ ముఖర్జీకి అవినాభావ సంబంధం ఉందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారని గుర్తు చేశారు. ఒక ఉద్యమన్ని ప్రారంభించి.. లక్ష్యం సాధించిన కొంతమంది నాయకుల్లో కేసీఆర్ ఒకరు అని ప్రణబ్ అనేవారు అని మంత్రి గుర్తు చేశారు.
అటు ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంతాపం తీర్మానం సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, మంత్రులు తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను కొనియాడారు. నిత్యం ప్రజల మధ్యే మనుగడ సాధించిన నిరాడంబర నాయుడు రామలింగారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు.