TRS Wins Neredmet Seat: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన టీఆర్ఎస్ ఖాతాలో మరో సీటు చేరింది. హైకోర్టు ఆదేశాలతో నేడు నెరేడ్‌మెట్ 136 డివిజన్ ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. గత 4వ తేదీ ఓట్లు లెక్కింపు సందర్భంగా నేరేడ్‌మెట్ టిఆర్‌ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉండటంతో.. బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. అయితే ఆ ఓట్లను కూడా లెక్కించేందుకు హైకోర్టు అంగీకరించడంతో నేడు సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో ఓట్లను లెక్కించారు. నేరేడ్‌మెట్ డివిజన్‌లో మొత్తం 25,176 ఓట్లు పోలవ్వగా.. 24,632 ఓట్లు లెక్కించారు. 504 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 ఓట్లను బుధవారం ఉదయం లెక్కించారు. అందులో టిఆర్‌ఎస్ అభ్యర్ధికి 238 ఓట్లు లభించాయి. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అయితే ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి చేశారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే నేరేడ్‌మెంట్ కౌంటింగ్‌లోజరిగిన వాదోపవాదాలపై ఆర్వో లీనా కలత చెందారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని.. నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని తెలిపారు. తనపై కొందరు అభ్యర్థులు ఆరోపణలు చేశారని.. తనను దూషించిన కాల్ రికార్డ్ కూడా ఉందని తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘానికి నివేదిక కూడా ఇస్తామని అన్నారు.
ఈ ఫలితంతో జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 రెండు స్థానాల్లో గెలిచినట్టయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2016లో 4 సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం 48 సీట్లు సాధించింది. గతంలో 99 సీట్లు గెలచుకున్న టీఆర్ఎస్.. ప్రస్తుతం 56 సీట్లకు పరిమితమైంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా టీఆర్ఎస్‌కు సొంతంగా మేయర్ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో.. మేయర్ సీటును ఆ పార్టీ ఏ రకంగా సొంతం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మేయర్ సీటు దక్కించుకునే విషయంలో టీఆర్ఎస్ ఎంఐఎం సహకారం తీసుకుంటే... రాజకీయంగా అది బీజేపీకి మరింత కలిసొచ్చే అంశంగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే మేయర్ ఎన్నికకు మరికొంత సమయం ఉండటంతో.. ఈ విషయంలో టీఆర్ఎస్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్న విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, GHMC Election Result, Telangana, Trs