Telangana: హుజూరాబాద్‌పై కేసీఆర్ నయా వ్యూహం.. బాధ్యతలన్నీ ఆ నేతలకే.. అదే అసలు కారణం

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఈటల రాజేందర్‌ను గట్టిగా కౌంటర్ ఇచ్చే ఉద్యమ నేతలను ఎంపిక చేసే పనిలో ఉన్న టీఆర్ఎస్ అధినేత.. మండలాలు, గ్రామాలు వారీగా వారికి బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమే. దీంతో ఈ సీటును మళ్లీ దక్కించుకునేందుకు ఈటల రాజేందర్.. హుజూరాబాద్‌పై టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈటల రాజేందర్ వంటి బలమైన నేతను ఉప ఎన్నికల్లో ఓడించడం అంత ఈజీ కాదనే విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఇందుకోసం పలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో మొదటి నుంచి పని చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు ఉద్యమ నేతలనే రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

  హుజూరాబాద్ ఉప ఎన్నికలు రావడానికి ముందే అక్కడ పని చేయడానికి కొంతమంది నేతలను ఎంపిక చేసే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. వారిలో ఎక్కువ మంది ఉద్యమ నేతలే ఉండాలని భావిస్తున్నారని టాక్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇతర పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారి ద్వారా ఈటలను టార్గెట్ చేయించడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న గులాబీ బాస్.. అలాంటి వారంతా హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు కోసం తెరవెనుక పని చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

  ఇక ఈటల రాజేందర్‌ను గట్టిగా కౌంటర్ ఇచ్చే ఉద్యమ నేతలను ఎంపిక చేసే పనిలో ఉన్న టీఆర్ఎస్ అధినేత.. మండలాలు, గ్రామాలు వారీగా వారికి బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్‌తో పాటు తాము కూడా పని చేశామని.. నాటి ఉద్యమకారుల్లో ఎక్కువమంది ఇంకా టీఆర్ఎస్‌లోనే ఉన్నారని ఆ నేతలంతా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో చెప్పనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌లో కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ కూడా తన వ్యూహాలను పదునుపెడుతున్నట్టు కనిపిస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: