హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీ వైపు చూస్తున్న ఎమ్మెల్సీ.. రహస్య మంతనాలు ?

Telangana: టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీ వైపు చూస్తున్న ఎమ్మెల్సీ.. రహస్య మంతనాలు ?

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Nagarjuna Sagar By election: నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండగా.. కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత టీఆర్ఎస్‌కు ధీటైన రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో పోలిస్తే బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో తమకు అనుకూలంగా వీస్తున్న రాజకీయ పవనాలను వినియోగించుకుని నాగార్జునసాగర్‌లో ఆధిక్యత సాధించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను కలిశారని.. నాగార్జునసాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు సమాచారం.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్‌కు త్వరలోనే ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దుబ్బాక విషయంలో జరిగినట్టుగా సాగర్ విషయంలో జరగొద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడం ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తారా లేక వేరే వారిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.

Nagarjuna Sagar By election, trs vs bjp, tera chinnapareddy to join bjp, telangana news, janareddy, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, తేరా చిన్నపరెడ్డి, తెలంగాణ న్యూస్, జానారెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి (ఫైల్ ఫోటో)

నాగార్జునసాగర్ బరిలో నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వకపోతే.. బీసీలకు కాకుండా రెడ్డి వర్గానికి చెందిన నేతలకు సీటు ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇక్కడి అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ తరపున నాగార్జునసాగర్ బరిలో నిలిచేందుకు నివేదితా రెడ్డి, అంజయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. ఒకవేళ తేరా చిన్నపరెడ్డి నిజంగానే బీజేపీలో చేేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Jana reddy, Nagarjuna Sagar By-election, Telangana, Trs

ఉత్తమ కథలు