హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నీటి కోసం రాజ్యాలే కూలిపోయాయి... కేంద్రంపై టీఆర్ఎస్ నేతల తీవ్ర ఆగ్రహం

Telangana: నీటి కోసం రాజ్యాలే కూలిపోయాయి... కేంద్రంపై టీఆర్ఎస్ నేతల తీవ్ర ఆగ్రహం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని.. ఇప్పుడు మరో ఉద్యమం చేస్తామని అన్నారు. నీళ్ల కోసం రాజ్యాలే కూలిపోయాయని.. తెలంగాణ హక్కులను కాల రాస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు

ఇంకా చదవండి ...

  నిన్నటి వరకు ఏపీ వర్సెస్ తెలంగాణగా ఉన్న జల వివాదం.. ఇప్పుడు తెలంగాణ వర్సెస్ కేంద్రంగా మారింది. ఏపీ, తెలంగాణలో నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై దుమారం రేగుతోంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులపై ఆయా బోర్డులదే పెత్తమని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై వాటి నిర్వహణ బాధ్యతను బోర్డులే నిర్వర్తిస్తాయి.  ప్రాజెక్టుల భద్రత కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుంది. నది యాజమాన్య బోర్డుల్లో తెలుగు రాష్ట్రాల వారు ఉండబోరు. బోర్డు ఛైర్మన్‌‌తో పాటు సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లు కూడా ఇతర రాష్ట్రాల వారే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల హెడ్‌వర్క్‌లు, బ్యారేజ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్‌ నిర్మాణాలు, కెనాల్‌ నెట్‌వర్క్స్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయి. నీళ్లు విడుదల, విద్యుత్ ఉత్పత్తిని కూడా బోర్డే పర్యవేక్షిస్తుంది. పరోక్షంగా ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులపై కేంద్రానిదే పెత్తనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  అక్టోబరు 14 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. ఏపీ, తెలంగాణ ఒక్కో బోర్డుకు సీడ్‌ మనీ కింద రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాలి. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు రాకుంటే ఆ ప్రాజెక్టులు అప్పటికే పూర్తైనా.. నిలిపివేయాలి. వాటికి ఎలాంటి కేటాయింపులు ఉండవు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. కేంద్రం పక్షపాతంగా వ్యహరిస్తోందని.. తెలంగాణ హక్కులను కాలరాస్తోందని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

  కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని.. ఇప్పుడు మరో ఉద్యమం చేస్తామని అన్నారు. నీళ్ల కోసం రాజ్యాలే కూలిపోయాయని.. తెలంగాణ హక్కులను కాల రాస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. అటు సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీటి పారుదలశాఖ నిపుణులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశముందని ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలిసింది.

  ఐతే టీఆర్ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు అంతేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. నీళ్ల పేరిట తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి.. హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క కూడా దీనిపై స్పందించారు. ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా డ్రామాలాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను ఏడేళ్లైనా ఎందుకు పూర్తి చేయలేదని టీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు ఏపీ నేతలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇన్నాళ్లు తెలంగాణపై తాము చేసిన ఆరోపణలు నిజమని రుజువయిందని వైసీపీ నేతలు అంటున్నారు. తమకు కేటాయించిన నీటి మాత్రమే వాడుకుటున్నామని.. అదనంగా ఒక్క చుక్క కూడా అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Krishna River, Krishna River Management Board, Telangana

  ఉత్తమ కథలు