HOME »NEWS »TELANGANA »trs mla rega kantha rao from pinapaka made sensational comments on forest officials on his facebook page ms kmm

‘ఇక సహించేది లేదు.. అమీతుమీ తేల్చుకుందాం..’ ప్రభుత్వ అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

‘ఇక సహించేది లేదు.. అమీతుమీ తేల్చుకుందాం..’ ప్రభుత్వ అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
రేగా కాంతారావు (ఫైల్)

పైన వార్త చూస్తుంటే ఇదేదో ప్రభుత్వం మీద ప్రతిపక్షాల యుద్ధ ప్రకటన అనుకుంటాం. కాదు. ముమ్మాటికీ కాదు. ఇది ప్రభుత్వంలో భాగమైన.. అదీ క్యాబినెట్‌ హోదా ప్రోటోకాల్‌ స్థాయి ఉండే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్య.

 • News18
 • Last Updated: December 16, 2020, 14:27 IST
 • Share this:
  'ఫారెస్ట్‌ అధికారులతో అమీతుమీ తేల్చుకుందాం.. లేకపోతే మన జీవితాలు రోడ్ల పైన అడుక్కుని తినుడే.. ఫారెస్ట్‌ అధికారులతో పోరాటానికి సర్పంచులు.. ఎంపీటీసీలు.. జడ్పీటీసీలు అందరూ ఐక్యతగా బాధ్యత తీసుకుని ప్రజలను సిద్ధం చేయండి..హైదరాబాద్‌ నుండి రాగానే ఫారెస్ట్‌ అధికారులతో ప్రత్యక్ష యుద్ధం. ప్రజల కోసం.. పోరాటానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, సిద్ధం కండి...’ ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక శక్తులో లేక ప్రతిపక్షాలో.. లేక పౌర హక్కుల నేతలో చేసిన ప్రకటన అనుకుంటున్నారా..? అస్సలు కాదు. ఈ ప్రకటన వెలువడింది స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఫేస్బుక్ ఖాతా నుంచే. ప్రభుత్వంలో ఉండీ.. అందునా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ వృత్తి నుంచి వచ్చిన సదరు ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..? అసలేం జరుగుతున్నది..?

  పైన వార్త చూస్తుంటే ఇదేదో ప్రభుత్వం మీద ప్రతిపక్షాల యుద్ధ ప్రకటన అనుకుంటాం. కాదు. ముమ్మాటికీ కాదు. ఇది ప్రభుత్వంలో భాగమైన.. అదీ క్యాబినెట్‌ హోదా ప్రోటోకాల్‌ స్థాయి ఉండే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్య. ఎందుకింత దూకుడు. ఏమిటీ వైఖరి అన్న ప్రశ్నలు ఉత్నన్నం కాకమానవు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రభుత్వ విప్‌గా ఉన్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలివి. భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు, దాష్టీకాలకు ఆగ్రహావేశాలకు గురై ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడా..? లేక ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా చేశాడా..? అన్న చర్చ ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.  అసలు విషయమేంటి..?

  పోడు ఆదివాసీల జీవనశైలి. అడవి నరికి సాగుచేసుకుని బతకడం వారి హక్కు. వారు పుట్టి పెరిగిన అటవీ ప్రాంతం వారి సొంతం. మూలవాసులైన వారి హక్కులకు ఎవరూ భంగం కలిగించరాదు. అది వ్యక్తి అయినా ప్రభుత్వం అయినా.. చివరకు చట్టం రూపంలోనూ వారి ప్రశాంత జీవనానికి భంగం కలగించరాదు. అయితే ఇదే క్రమంలో రానురానూ తరిగిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం శ్రమిస్తున్న అటవీ శాఖ తమ విద్యుక్త ధర్మాన్ని తాము నిర్వర్తించాలన్న దిశగా ముందుకెళుతోంది.

  రేగా కాంతారావు ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు..


  అయితే పోడు పేరిట, ఆదివాసీల హక్కుల పేరిట పర్యావరణాన్ని ఫణంగా పెట్టలేమన్నది అటవీ శాఖ చెబుతున్న మాట. పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలలో ఈ పోడు రగడ గత కొన్ని సంవత్సరాలుగా సాగుతునే ఉంది. అడవిని నరుకుతున్నారని అటవీశాఖ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఈ ప్రాంతంలో నిత్యకృత్యం. దీనికి తోడు రెవెన్యూ భూములకు, అటవీ భూములకు మధ్య సరిహద్దు వివాదాలు ఏళ్ల తరబడి సాగుతున్న దుస్థితి కూడా ఉంది. దీంతో ఆదివాసీలు సాగు చేసి పైరు వేయడం, అటవీశాఖ అధికారులు పాడుచేయడం నిత్యకృత్యంగా మారింది. ఇది క్రమేణా ఆదివాసీలకు, అటవీశాఖకు పూడ్చలేని అగాధాన్ని పెంచింది. దీనికితోడు ఆదివాసీల జీవన పోరాటాన్ని రాజకీయ మనుగడకు ఉపయోగించుకోడానికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సీజనల్‌గా పిలుపునివ్వడం కూడా ఇక్కడ మామూలు విషయమే. మరి ప్రభుత్వ విప్‌గా ఉన్న రేగా కాంతారావు సంప్రదింపులతో ఈ వివాదాన్ని పరిష్కరించకుండా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అంతర్యం ఏంటన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

  ఈ వ్యాఖ్యల  వెనుక మర్మమేమిటి..?

  ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన రేగా కాంతారావు 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో వారికి బాగా దగ్గరై, ఈ ప్రాంతంలోని గోదావరి నది ఇసుక మాఫియాకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో 2014లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తన నియోజకవర్గంలోని మణుగూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని ఆక్రమించడం మొదలు.. ఇసుక అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వివాదాలున్నాయి.

  ఆదివాసీ బిడ్డ అయిన కాంతారావు గిరిజనేతరులను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంత గిరిజనం హక్కులకు గండికొడుతున్నారంటూ నిత్యం కాంగ్రెస్‌ సహా వామపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టడానికే రేగా కాంతారావు వ్యూహాత్మకంగా తానే అటవీ అధికారులపై పోరాటానికి పిలుపునిచ్చారని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో తనకున్న చనువుతో సులభంగా పరిష్కరించాల్సిన వ్యవహారాన్ని పోరాటాలు, యుద్ధాలు అంటూ మరింత పెద్దది చేస్తూ వివాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరి ఇది ఏ రూపం తీసుకుంటుందో చూడాల్సిఉంది.
  Published by:Srinivas Munigala
  First published:December 16, 2020, 14:27 IST