తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ అరెస్టుతో కరీంనగర్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జీవో 317కు వ్యతిరేకంగా జాగరణ దీక్షకు పూనుకున్న బండిని పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ ఆఫీసు తాళాలు బద్దలు కొట్టిమరీ పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో ఆదివారం రాత్రి నుంచి నగరంలో టెన్షన్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నల్గొండ సభకు అనుమతిచ్చి, తన దీక్షకు మాత్రం పర్మిషన్ ఎందుకీయరని పోలీసులను బండి నిలదీశారు. నిన్న రాత్రి బండి అరెస్టు తర్వాత కరీంనగర్ జిల్లాకే చెందిన టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ మీడియా ముందుకొచ్చారు. సంజయ్ అరెస్టుకు దారి తీసిన కారణాలు, బీజేపీ దురుద్దేశాలంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలివి..
ప్రతి పౌరుడూ విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం దీక్ష పేరుతో నిబంధనలు ఉల్లంఘించారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ సిటీలో ఒమిక్రాన్ కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందితే అందుకు బండిదే బాధ్యత అన్నారు. సంజయ్ చేపట్టింది జాగరణ దీక్ష కాదని, డ్రామాదీక్ష అని మంత్రి ఎద్దేవా చేశారు.
బండి తన దీక్షను ప్రధాని మోదీ ఇంటిముందు చేసి కోటి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేయాలన్నారు మంత్రి గంగుల. అనుమతి తీసుకోకుండా దీక్ష చేసింది చాలక కరీంనగర్ లో రాద్ధాంతం చేశారన్నారు. గుర్తింపు పొం దిన 8 సంఘాలతోపాటు వేరే సంఘాలు కూడా 317 జీఓ నిర్ణయంపై జరిగిన చర్చలో పాల్గొన్నాయని, అన్నీ చర్చించాకే జీవో తెచ్చామని మంత్రి స్పష్టం చేశారు.
బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీసులు మంచి పనిచేశారని, లేకుంటే మహమ్మారి ప్రబలేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ అతీతులు కారన్నారు. కేంద్రం చెబుతున్న నిబంధనలను అదే పార్టీకి చెందిన ఎంపీ ఉల్లంఘించడం సరికాదన్నారు. తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు మంత్రి గంగుల.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Covid, Gangula kamalakar, Karimnagar, Omicron