(K.Veeranna,News18,Medak)
ఎక్కడైనా కాసుల వర్షం కురుస్తుందా. కురవదు. దుబాయ్‌లో మాత్రమే షేక్‌లు కరెన్సీ నోట్లను విసిరేస్తూ ఉంటారు. ఏదైనా సంతోషకరమైన సందర్భం వచ్చినా, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే కరెన్సీ నోట్ల(Currency notes)ను గాల్లో విసిరేయడం మాత్రమే మనం చూశాం. దుబాయ్(Dubai)కాదు ఇప్పుడు మన తెలంగాణ (Telangana)లో అది కూడా మెదక్(Medak) జిల్లాలో దుబాయ్ షేక్‌ల తరహాలో కరెన్సీ నోట్లు అంటే అక్షరాల 500 రూపాయల నోట్లను ఆనందంతో గాల్లో విసిరేశాడు ఓ అభిమాని.
నర్సాపూర్‌లో కనకవర్షం..
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం కొత్తగా ఆర్టీసీ బస్ డిపోని ప్రారంభించారు రాష్ట్ర ఆర్ధికశాఖ, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ఈసందర్బంగా స్థానికులు, పార్టీ శ్రేణులు అభినందనసభ ఏర్పాటు చేశారు. సభావేదికపై సింగర్ సాయిచంద్ పాటపాడారు. అదే సమయంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మెన్ మురళియాదవ్ డ్యాన్స్ చేయడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం రెట్టింపు అయింది. మంత్రుల సమక్షంలో ఈకార్యక్రమం జరుగుతుండగానే నర్సాపూర్‌కి చెందిన టౌన్ లీడర్ శ్రీధర్ గుప్తా 500రూపాయల నోట్లను గాయకుడు సాయిచంద్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌పై చల్లారు. ఒకటి రెండు కాదు 50వేల రూపాయల 500నోట్లను అలా వారిపై చల్లుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వేల వరకు ఇలా నోట్లను వెదజల్లడంతో వేదికపై కూర్చున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. శ్రీధర్‌గుప్తా విసిరిన కరెన్సీ నోట్లను అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకొని జేబులో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నేతలపై 500నోట్లు విసిరిన అభిమాని..
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు డిపోను ప్రారంభించిన అనంతరం మంత్రులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఓవైపున అమ్ముకుంటూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్, విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి వాటిలో వేలాది మంది ఉద్యోగాలు పోవడానికి కారణమయ్యారని బీజేపీ నేతలపై మండిపడ్డారు హరీష్‌రావు.
ఆర్టీసీ బలోపేతం చేస్తామన్న మంత్రి...
మరోమంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో కొత్త డిపోలకు నోచుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ బ్రతికించారని చెప్పారు. బడ్జెట్‌లో సంస్థకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. కార్గో ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. నర్సాపూర్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు మంత్రి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medak, Telangana, TRS leaders