Eatala Rajender: BJPలో చేరిన ఈటల రాజేందర్... ఇక TRSపై పోరుబాట... నెక్ట్స్ ఏం జరుగుతుంది?

ఈటల రాజేందర్

Eatala Rajender: అంతా అనుకున్నట్లే జరిగింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వల్ల తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో చూద్దాం.

 • Share this:
  Eatala Rajender: భూ ఆరోపణలతో... టీఆర్ఎస్‌ పరోక్ష బహిష్కృత నేతగా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్... తన రాజకీయ భవిష్యత్తును జాగ్రత్తగా పదిలపరచుకుంటూ... ఏకంగా బీజేపీలో చేరారు. తన మద్దతు దారులతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన... బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కండువా కప్పి BJPలోకి ఆహ్వానించారు కేంద్ర మంతి ధర్మేంద్ర ప్రదాన్. ఈటల రాజేందర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.

  ఈ కార్యక్రమం తర్వాత ఈటల ప్రతిజ్ఞ చేశారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానన్న ఆయన... తెలంగాణలో బీజేపీని అన్ని గ్రామాలకూ తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని తెలియజేస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత దేశంలో, తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కమలం గూటికి చేరిన తనకు స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ధన్యవాదములు తెలిపారు.


  ఈటల బీజేపీలో చేరడంతో ఆ పార్టీ రాష్ట్ర వర్గంలో ఉత్సాహం మరింత పెరిగింది. తెలంగాణ సీఎం KCRని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీయే అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నియంత పాలన అంతానికీ.... తెలంగాణ తల్లి విముక్తి కోసం బీజేపీ పని చేస్తుందన్న ఆయన... బీజేపీ నమ్మి పార్టీలోకి వచ్చిన ఈటెల రాజేందర్‌కి స్వాగతం అన్నారు.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారికి ఆశయాలు ఎక్కువ... వీరికి తక్కువ

  నెక్ట్స్ ఏంటి?
  టీఆర్ఎస్‌కి దూరమైనప్పటి నుంచి ఈటల వేస్తున్న ప్రతి అడుగునూ టీఆర్ఎస్ పార్టీ నేతలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యగానే... ఈటలపై మాటల దాటిని మొదలుపెట్టారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తమ కేడర్ చెక్కుచెదరలేదని భావిస్తున్న టీఆర్ఎస్‌కి ఈటల చేరికతో బలంగా పోరాడే అవకాశం దక్కిందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారబోతోంది. ఈ ఎన్నికలో బీజేపీని ఓడించి... ఇక తెలంగాణలో తమకు తిరుగు లేదు అని చెప్పుకోవాలని టీఆర్ఎస్‌ లెక్కలేస్తోంది. అదే... బీజేపీ గెలిస్తే... టీఆర్ఎస్ పని అయిపోయింది అని ప్రచారం చేసేందుకు తమకు వీలవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇలా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది అనేది రెండు పార్టీలకూ సవాలుగా మారనుంది. ఈ కారణంగా తెలంగాణ రాజకీయాలు మళ్లీ చురుగ్గా, ఆసక్తికరంగా మారుతున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: