TRS CM KCR RETURNS HYDERABAD IN THE MIDDLE OF NATIONWIDE TOUR WHICH TARGETS BJP PM MODI MKS
CM KCR : సీఎం కేసీఆర్ అనూహ్యం.. దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే అర్దాంతరంగా హైదరాబాద్కు.. కారణమిదే..
సీఎం కేసీఆర్ (పాత ఫొటో)
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పన కోసం దేశవ్యాప్త పర్యటన చేపట్టిన టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంతరంగా హైదరాబాద్ తిరిగొచ్చేశారు. రాష్ట్రం రుణ సమీకరణకు కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో సీఎం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు..
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపొందించడమే లక్ష్యంగా, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడమే ధ్యేయంగా దేశవ్యాప్త పర్యటన చేపట్టిన టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) అర్ధాంతరంగా హైదరాబాద్ తిరిగొచ్చేశారు. ఈ నెల 27 వరకు కొనసాగాల్సిన పర్యటనను మధ్యలోనే ముగించుకొని అనూహ్యంగా ఆయన సోమవారం రాత్రే సిటీకి హైదరాబాద్కు (KCR Returns Hyderabad) చేరుకున్నారు.
తెలంగాణ అప్పులపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించడం, రాష్ట్ర అధికారులు రోజులపాటు ఢిల్లీలో మకాంవేసినా కేంద్రం కనికరించడకపోవడం, నిధులు లేని దుస్థితిలో ప్రాజెక్టులు, పథకాలు నిలిచిపోయే పరిణామాలు తలెత్తిన దరిమిలా ఇక్కడ చక్కబెట్టాల్సిన వ్యవహారాల కోసమే కేసీఆర్ తన జాతీయ ప్రణాళికలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ ఈనెల 20న ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) చేసిన ప్రకటన ప్రకారం గత నాలుగు రోజుల షెడ్యూల్ సాగగా, ఈ నెల 26న బెంగళూరుకు, 27న రాలెగావ్ సిద్దికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. బెంగళూరులో జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారని సీఎంవో పేర్కొంది. అక్కడి నుంచి 27న రాలెగావ్ సిద్ది పర్యటనకు వెళ్లి.. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో బేటీ అవుతారని, షిర్డీకి వెళ్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొస్తారని, ఒక రోజు వ్యవధిలోనే మళ్లీ..
సీఎంవో షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఈనెల 27న హైదరాబాద్ తిరిగొచ్చి, మళ్లీ ఒక రోజు వ్యవధిలోనే అంటే, 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్ పర్యటనకు వెళతారని మమతా బెనర్జీ, తేజస్వియాదవ్ తదితరులను కలుసుకోవాల్సి ఉంది. కానీ, కేసీఆర్ సడన్ గా తన దేశవ్యాప్త పర్యటనకు బ్రేకిచ్చి రాష్ట్రానికి వచ్చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ ఈనెల 26న హైదరాబాద్ వస్తున్నారు కాబట్టే సీఎం కేసీఆర్ భయపడి పారిపోయారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తుండటం తెలిసిందే. అయితే..
దేశవ్యాప్త పర్యటన నుంచి కేసీఆర్ సడన్ గా హైదరాబాద్ రావడానికి బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. అప్పుల వ్యవహారంలో కేంద్రం వైఖరి రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిన క్రమంలోనే కఠిన వైఖరి ఎత్తుకునేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తారని సమాచారం. మళ్లీ మోదీ హైదరాబాద్ రాకముందే కేసీఆర్ తిరిగి ఢిల్లీ వెళతారని పార్టీ నేతలు అంటున్నారు. హైదరాబాద్లో ముఖ్యమైన పనులు చూసుకొని మళ్లీ వద్దామని టీఆర్ఎస్ ముఖ్యనేతతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది.
తన మూడు రోజుల ఢిల్లీ, పంజాబ్ పర్యటనల్లో సీఎం కేసీఆర్.. యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను కలుసుకొని కీలక చర్యలు జరిపారు. ఆప్ సీఎంలు ఇద్దరి సమక్షంలో చండీగఢ్ లో జరిగిన కార్యక్రమంలో పంజాబ్ రైతు అమరుల కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు. ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, పలువురు మాజీ ఐఏఎస్ లతోనూ మాట్లాడారు. సోమవారం నాడు సీఎం.. వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటీతో భేటీ అయ్యారు. దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలపై దాదాపు మూడు గంటల పాటు ఆయనతో చర్చలు జరిపారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, సరైన గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. అశోక్ గులాటీ గతంలో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్కు గులాటీ చైర్మన్ గా వ్యవహరించడం, పలు ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధరలను పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించడం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.