TRS CM KCR LIKELY TO START VYAVASAYA PRAGATHI PROGRAM AIMING FARMERS DAYS AFTER CONGRESS WARANGAL DECLARATION MKS
CM KCR: కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌కు విరుగుడుగా.. రైతులే లక్ష్యంగా కేసీఆర్ కొత్త ప్రోగ్రాం..
కేసీఆర్, రాహుల్, రేవంత్
అన్నదాతలకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో చేస్తున్నా అనూహ్య రీతిలో రైతుల అంశాన్నే హైలైట్ చేస్తూ, టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయ విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ విపక్ష కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’ ప్రకటించింది. దానికి ధీటుగా గులాబీ బాస్ కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. వివరాలివే..
ఓవైపు రైతు బంధు.. మరోవైపు కాళేశ్వరం పూర్తి.. ఇంకోదిక్కు మిషన్ కాకతీయ చెరువుల మరమ్మతు.. ఆపై వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్.. ఇలా అన్నదాతలకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో చేస్తున్నా అనూహ్య రీతిలో రైతుల అంశాన్నే హైలైట్ చేస్తూ, టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయ విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ విపక్ష కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’ ప్రకటించింది. కేసీఆర్ కంటే మెరుగైన వ్యవసాయ విధానం తీసుకొస్తామని, ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీతోపాటు కౌలు రైతులకూ ఏటా రూ.15వేల నగదు బదిలీ, వ్యవసాయ కూలీలకూ రూ.12 వేలు, వ్యవసాయానికి ఉపాధిహామీ జోడింపు లాంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించిన దరిమిలా తెలంగాణలో ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చర్చనీయాంశమైంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కు విరుగుడు మంత్రంగా కేసీఆర్ సరికొత్తగా సుదీర్ఘ కాలం కొనసాగే ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో నియంత్రిత సాగు అమలు దిశగా సీఎం కేసీఆర్ గతంలో చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, కాళేశ్వరం నిండా నీళ్లు, ఫుల్లుగా కరెంటు ఉన్నా వరి పంట వేస్తే ఉరి వేసుకున్నట్లేనని హెచ్చరించడం, కేంద్ర సర్కారుపై అసాధారణ రీతిలో వరి పోరు సాగించడం, చివరికి తానే తగ్గి ధాన్యం మొత్తాన్ని కొంటానని సీఎం ప్రకటించడం తెలిసిందే. కాగా, కేసీఆర్ భిన్న ప్రకటనలు, విరుద్ద నిర్ణయాల వల్ల రైతులు నష్టపోయారని, టీఆర్ఎస్-బీజేపీ కుమ్మకై రైతుల్ని మోసపూచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అసలు విపక్షాలకు (2023)ఎన్నికల అంశమే లేదనే భావనకు విరుద్దంగా కాంగ్రెస్.. కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టే వ్యవసాయ అంశాలనే అస్త్రాలుగా మలుచుకోవడం వ్యూహాత్మక ఎత్తుగడగా పరిణమించింది. అయితే ఇకపై సాగుకు సంబంధించి విమర్శలకు తావు లేకుండా, రైతులతో ప్రభుత్వం నిరంతరం ఎంగేజ్ అయ్యేలా కేసీఆర్ ఆదేశాల మేరకు ‘వ్యవసాయ ప్రగతి’ కార్యక్రమానికి అడుగు పడుతున్నాయి..
రైతులకు సాగు ప్రణాళిక, సమస్యలపై అధికారులు సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ‘వ్యవసాయ ప్రగతి’ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. టీ సర్కారు ఇప్పటి దాకా నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల తరహాలోనే వ్యవసాయ ప్రగతి పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టి, రైతుల వద్దకు స్వయంగా అధికారులే వెళ్లి వివిధ అంశాలపై చర్చించి, వారితో వ్యూహాత్మకంగా పంటల సాగు చేయించాలని ఆలోచిస్తోంది. సాగు సంబంధిత విషయాల్లో కేసీఆర్ వైఫల్యాలకు చికిత్సగా, అదే సమయంలో కాంగ్రెస్ ఎత్తుకున్న రైతు అంశాలకు ధీటుగా వ్యవసాయ ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రస్తుత వ్యూహంగా కనిపిస్తున్నది. రైతు వేదికలు ఆశించిన మేర సద్వినియోగం కాకపోవడం కూడా ఈ కార్యక్రమ ఉద్దేశాల్లో ఒకటిగా ఉంది.
రైతుల నుంచి వ్యతిరేక పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ‘వ్యవసాయ ప్రగతి’ని నిర్వహించాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం మార్గదర్శకాలను తయారు చేసే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. వ్యవసాయ ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా.. వానాకాలం, యాసంగి.. సీజన్ల ప్రారంభ సమయంలో గ్రామాలవారీగా, వీలైతే క్లస్టర్ల వారీగా కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయి. వ్యవసాయ, నీటి పారుదల, మార్కెటింగ్, ఉద్యాన, సహకార, విద్యుత్తు, పశు సంవర్థక శాఖలతో పాటు ఆచార్య జయఽశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలను కూడా భాగస్వాములను చేయనున్నారు.
వరి పొలాల్లో చేపల పెంపకం, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగం, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, బిందు- తుంపర సేద్యం, పంట ఉత్పత్తులు, మార్కెట్ డిమాండ్ ఇలా అన్ని అంశాలపై వ్యవసాయ ప్రగతిలో సమీక్షించే అవకాశాలున్నాయి. భూసార పరీక్షల కోసం మొబైల్ టెస్టింగ్ యూనిట్లు, రైతులకు పనిముట్లు అందుబాటులో ఉంచటానికి కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. స్వల్ఫకాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికలు కూడా తయారు చేయనున్నారు. కల్తీ, నకిలీలను నియంత్రించటానికి టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. మరోవైపు,
వ్యవసాయ యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు శాస్త్రవేత్తల వ్యక్తిగత రికార్డులు, యూనివర్సిటీ అవార్డులు, రివార్డుల వరకే పరిమితమవుతున్నాయని, రైతుల వ్యవసాయక్షేత్రంలోకి ప్రయోగాల ఫలితాలు వెళ్లటంలేవనే అభిప్రాయంతో ఉన్న సీఎం కేసీఆర్.. ‘ల్యాబ్ టు ల్యాండ్’ అనే వ్యవస్థను తీసుకరావాలని, ప్రయోగ ఫలితాలు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు ప్రారంభించాలనీ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి కూడా వ్యవసాయ ప్రగతిని వేదికగా చేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రైతు అంశాలపై కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ వెలువడిన కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ వ్యవసాయ సంబంధిత భారీ ప్రణాళికకు పూనుకోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.