Telangana: జానారెడ్డి కుమారుడిపై టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కానీ ఆయన మాత్రం...

రఘువీర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: టీఆర్ఎస్, బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆయన మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడని సమాచారం.

 • Share this:
  నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో మంచి ఊపుమీదున్న బీజేపీ.. నాగార్జునసాగర్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ సెగ్మెంట్‌లో తమకంటూ ప్రత్యేకంగా పట్టులేకపోయిప్పటికీ పార్టీ మీదున్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిసి వస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. నాగార్జునసాగర్‌లో తిరుగులేని నేతగా పేరున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో 7771 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జానారెడ్డి ప్రచారం చేసినా టీఆర్ఎస్ ప్రభంజనంలో నోముల నర్సింహయ్య విజయం సాధించారు. అప్పటి నుంచి జానారెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారా లేదా అనే అంశం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలి ఉంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ సర్వత్రా సాగుతోంది.

  ‘పెద్దలు జానారెడ్డి’గా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గౌరవంగా పిలిపించుకునే జానారెడ్డి కుటుంబానికి టీఆర్ఎస్ ఎర వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి భార్యకు పార్టీ టికెట్ ఇచ్చి పరాభవం పాలైన అధికార పార్టీ ఈ సారి ఆ పొరపాటు చేయొద్దని భావిస్తోంది. అదే జరిగితే ఈసారి నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా జానారెడ్డి కుటుంబానికి కేసీఆర్ నుంచి ఇప్పటికే ఆహ్వానం అందిందని సమాచారం. దీనికి ప్రతిగా జనారెడ్డి... తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. అయితే తన కుమారుడు రఘువీర్ రెడ్డి తీసుకునే రాజకీయ నిర్ణయంలో తాను జోక్యం చేసుకోబోనంటూ... పరోక్షంగా కుమారుడు టీఆర్ఎస్‌లో చేరాలని భావిస్తే తాను అడ్డుకోబోనని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే జరిగితే... రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి అధికార పార్టీ కండువా కప్పుకొని ఎన్నికల బరిలో దిగేందుకు లైన్ క్లియర్ అయినట్టే అని భావించాల్సి ఉంటుంది.

  అయితే తాజా ప్రభంజనంతో దూసుకుపోవాలని చూస్తున్న కమలదళం కూడా నాగార్జున సాగర్‌లో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇదే క్రమంలో జానారెడ్డి కుమారుడే మంచి ఆప్షన్‌గా భావిస్తోంది బీజేపీ. బీజేపీ కూడా రఘువీర్‌ను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్టు సమాచారం. రఘువీర్ కూడా టీఆర్ఎస్ కంటే బీజేపీలో చేరేందుకే సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సారి ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... పదేళ్లు పాలించిన టీఆర్ఎస్‌కు రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిబంధకంగా మారుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఎలాగూ చతికలపడిపోయింది కాబట్ట తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యేమ్నయం అనే భావనలో రఘువీర్ ఉన్నట్టు టాక్. కానీ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయో చూసిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
  Published by:Kishore Akkaladevi
  First published: