(K.Lenin,News18,Adilabad)
అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో కల్లా, కపటం తెలియని ఆదివాసి గిరిజన(Aboriginal tribes)కుటుంబాలు వేలాదిగా జీవిస్తున్నాయి. అందుకే ఈ జిల్లాకు ఆదివాసీల ఖిల్లాగా పిలుస్తారు. ఇక్కడి ఆదివాసి గిరిజనుల సంస్కృతి(Culture), సంప్రదాయాలు(Traditions)చూసేవాళ్లకు వింతగా అనిపించినప్పటికి ఎంతో విశిష్టతను సంతరించుకుని ఉన్నాయి. అందుకే వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావి తరాలకు వాటిని వారసత్వంగా అందజేస్తున్నారు. ఏడాది మొత్తంలో అనేక పండుగలను జరుపుకునే ఆదివాసి గిరిజనులు అందులో ఆటపాటలకు పెద్దపీఠ వేస్తారు. వారు జరుపుకునే పండుగలు ఇతర పూజా కార్యక్రమాలు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబిస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో పెర్సపెన్(Persapen) ఉత్సవాలు గిరిజన సంప్రదాయం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి.
అడవి బిడ్డల పండుగ..
ఆదివాసి గిరిజనులు తమ పెద్ద దేవుడిగా కొలిచే ఈ పెర్సపేన్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరుపుకునే వేడుకల్లో తమ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నారు. మండుటెండల్లో ఉపవాసం ఉంటూ తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివాసి గిరిజనుల్లోని నాలుగు, ఐదు, ఆరు, ఏడు సంఘాలకు చెందిన గిరిజనులు గత ఇప్పచెట్టుపై ఉంచిన పెర్సపేన్ ను కిందకు దించి గ్రామాల్లోకి తీసుకురావడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
కొత్త కోడళ్లతో పూజలు..
ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల నడుమ మెస్రం వంశస్థుల అల్లుళ్లు పవిత్ర జలంతో దైవ స్నానం చేయించారు. అనంతరం ఇంటి అల్లుడు ఇప్పచెట్టుపై ఆ దేవుడిని ఉంచడంతో పెర్సపేన్ పూజలు ముగుస్తాయి. ఇందులో భాగంగా గిరిజనులు జరుపుకునే భేటింగ్ పూజలు ప్రత్యేకత ఉంది. తమ ఇంటి కొత్త కోడళ్ళను కుటుంబ పెద్దలు తమ దైవాలకు పరిచయం చేసే కార్యాన్నే భేటింగ్ అని పిలుస్తారు. ఇలా భేటింగ్ జరిగితే ఆ ఇంటి కొత్త కోడళ్ళు ఇతర దేవతలను చూడగలుగుతారని, ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారమని, దీన్ని కట్టుతప్పకుండా ఆచరిస్తున్నామని గిరిజనులు పేర్కొంటున్నారు.
ఆదివాసీ గిరిజనుల ఆట,పాటలు..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం ఉషేగాం, దేవుగూడ గ్రామాల్లో ఈ పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గిరిజన తెగలోని నాగ్ భీడ్ వంశం కొత్తకోడళ్ళు భేటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 107 మంది కొత్తకోడళ్ళకు భేటింగ్ నిర్వహించారు. మరోసారి కేస్లాపూర్ నాగోబా జాతరలోనూ మెస్రం వంశ కొత్త కోడళ్ళకు భేటింగ్ నిర్వహిస్తారు. కాగా ఈ పెర్సపేన్ ఉత్సవాలకు జిల్లాలోని ఆదివాసి గిరిజన గూడల నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా గిరిజనులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గిరిజన గూడాల్లోనూ ఈ పెర్సపేన్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.