Home /News /telangana /

TRIBALS HELD KAPPATALLI CELEBRATIONS IN ADILABAD DISTRICT TO ENSURE GOOD RAINS SNR ADB

Telangana : కప్పలను రోకలికి కట్టి పిల్లలతో ఊరేగింపు .. అటుపై అభిషేకం ఎందుకిలా చేస్తారంటే

(కప్పతల్లి పండగ)

(కప్పతల్లి పండగ)

Variety Festival: తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రాంతానికో పద్దతి, ఒక్కో తెగకు ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో గిరిజన బిడ్డలు వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్దిగా పండాలని కోరుతూ కప్పతల్లి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలు చాల వింతగా ఉంటాయి.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    వైశాఖ మాసం అమావాస్య సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad)జిల్లాలోని గిరిజన గూడెల్లో బుడ్ బావై పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆదివాసి గూడాల్లో కప్ప తల్లి(Kappa talli)ఆట ఆడారు. వర్షాలు సమృద్దిగా కురువాలని కోరుకుంటు మిరుగుకు వారం రోజుల ముందు నుండి ఈ బుడ్ బావై ఉత్సవాల(Bud Bawai Festival)ను గిరిజన గూడల్లో నిర్వహిస్తారు. ఓ రోకలికి కప్పను కట్టి, పిల్లలు నడుముకు, కాలికి గజ్జెలు కట్టుకొని, కప్పను కట్టిన రోకలిని భుజాన మోసుకుంటూ నృత్యాలు(Dances) చేస్తూ ఇంటింటికి తిరిగుతూ కప్పతల్లికి స్నానం చేయించారు. చిన్నారులు కప్పతల్లితో ఇంటిముందుకు రాగానే మహిళలు రోకలి కట్టిన కప్పపై నీళ్లు పోసి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.

    వర్షాలు కురవాలని కోరుతూ..
    ఇలా ఊరంతా నృత్యాలు చేస్తూ తిరుగుతూ కప్పతల్లి ఆట ఆడిన అనంతరం గ్రామ శివారులో వదిలిపెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అలా వదిలి పెట్టిన కప్ప ఏ దిక్కు వైపు పోతుందో ఆ దిక్కు నుండి వర్షాలు వస్తాయని ఆదివాసుల నమ్మకం. ఆదిలాబాద్ జిల్లా తాంసి, భీంపూర్ మండలాల్లో ఈ బుడ్ బావై వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. భీంపూర్ మండల కేంద్రంతోపాటు మండలంలోని రాజ్ ఘడ్ గ్రామంలో, తాంసి మండలంలోని లీము గూడ గ్రామంలో ఈ కప్పతల్లి ఆట ఆడారు.

    (కప్పతల్లి పండుగ)
    (కప్పతల్లి పండుగ)


    కప్పలకు అభిషేకాలు..
    మరోవైపు బోథ్ మండలంలోని మామిడిగూడ, పాట్నాపూర్ తోపాటు బజార్ హత్నూర్ మండలం మోర్కండి, ఉప్పర్ పల్లి, గిరిజాయి, ఉమర్డ, కొత్తపల్లి, రాజులగూడ, అనంతపూర్ గ్రామాల్లో, ఇంకా సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామంలో, ఇంద్రవెల్లి మండల కేస్లాపూర్ సహా పలు ఆదివాసి గూడాల్లో ఈ బుడ్ బావై వేడుకను జరుపుకున్నారు. మరోవైపు వానాకాలం సాగు మొదలవుతున్న నేపథ్యంలో రైతు కుటుంబాలు తరాల ఆచారం ప్రకారం గ్రామదేవతలకు, గంగమ్మకు పూజలు చేస్తున్నారు.

    నెల రోజుల పాటు పండగే..
    తాంసి, భీంపూర్ మండలాల రైతు కుటుంబాలు తమకు దగ్గరగా ఉన్న అంతర్గామ, వడూర్ , గొల్లఘట్ తాంసి పెన్ గంగ తీరాలకు ఎడ్ల బండ్లు, ఇతర వాహనాల్లో వెళ్లి అక్కడ పుణ్య స్నానాలు చేస్తున్నారు. అనంతరం అక్కడి రకాల పిండి వంటలు తయారు చేసి గంగపుత్రులు తయారు చేసిన ప్రత్యేక తెప్పల్లో వాటిని పెట్టి గంగమ్మకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వర్షాలు బాగా కురువాలని, పంటలు బాగా పండాలని, పశుసంపత్తి వృద్ధి చెందాలని, తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ గంగమ్మను వేడుకున్నారు.  ఆ తర్వాత  కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నెల రోజుల పాటు ఇలా ఆయా గ్రామాల వారు గంగ చెంతకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Festival, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు