ఘనంగా ఆదివాసుల ఆత్మబంధువు ప్రొ.హైమన్ డార్ఫ్ వర్ధంతి వేడుకలు

హైమన్ డార్ఫ్ దంపతుల విగ్రహాలు

1909 జూన్ 22న జన్మించిన డార్ఫ్ 1930 సంవత్సరంలో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రంలో డాక్టరేటును పొందారు. పలుదేశాల్లో పర్యటించి ఆదివాసి గిరిజనుల జీవన విధానం, స్థితిగతులపై అధ్యయనం చేశారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  అడవులు.. కొండలు.. గుట్టల.. మధ్య విసిరేసినట్లు ఉండే గిరిజన గూడాల్లోని ఆదివాసుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ప్రొ. క్రిస్టఫర్ వాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ వారి ఉన్నతి కోసం కృషి చేసి వారికి ఆత్మబంధువయ్యారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. తమ భాష మాట్లాడే వ్యక్తి కాదు, తమ ప్రాంత వాసి కాదు, దగ్గరికి తీయడానికి జంకుతున్న సమయంలో మార్లవాయి గ్రామానికి చెందిన లచ్చుపటేల్ ఆశ్రయం కల్పించారు. అయినా దీంతో హైమన్ డార్ఫ్ తన భార్య బెట్టి ఎలిజబెత్ తో కలిసి మూరుమూల గిరిజన గ్రామమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పరిశోధనలు కొనసాగించాడు.

  అధ్యయనంలో భాగంగా ఎన్నో ప్రాంతాలు తిరిగినా, ఎన్నో జాతులను కలిసిన మార్లావాయి గ్రామంపై ఏర్పాడిన ఇష్టంతో ఇక్కడె శాశ్వతంగా ఉండిపోయారు. ఇక్కడి గిరిజనుల స్థితిగతులను చూసి చలించినపోయిన హైమన్ డార్ఫ్ ఆదివాసుల కష్టాలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి ఇబ్బందులను దూరం చేయడంతో ఆదివాసులకు ఆరాధ్యుడయ్యారు. గిరిజనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. 1909 జూన్ 22న జన్మించిన డార్ఫ్ 1930 సంవత్సరంలో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రంలో డాక్టరేటును పొందారు. పలుదేశాల్లో పర్యటించి ఆదివాసి గిరిజనుల జీవన విధానం, స్థితిగతులపై అధ్యయనం చేశారు.  నిజాం కాలంలో కొమురంభీం నాయకత్వంలో గిరిజనులు లేవనెత్తిన తిరుగుబాటుకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తరఫున 1940లో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన హైమన్ డార్ఫ్ మార్లవాయి గ్రామంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆదివాసులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి కావాల్సిన సహకారం కోసం ఇక్కడే ఉండి నిజాం ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తు ప్రభుత్వాలకు గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు చేశారు. ఆదివాసులతో ఏర్పడిన అనుబంధానికి ప్రతీకగా డార్ఫ్ దంపతులు తమ కుమారుడికి లచ్చుపటేల్ అని గిరిజనుడి పేరుపెట్టుకున్నారు.

  1990లో బెట్టి ఎలిజబెత్ కన్నుమూయడంతో ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గిరిజన సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. 1995లో మృతి చెందిన హైమన్ డార్ఫ్ కు కూడా మార్లవాయిలోనే ఎలిజబెత్ సమాధి పక్కనే సమాధి కట్టారు. వారి విగ్రహాలను కూడా గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే డార్ఫ్ మరణం తర్వాత 17 సంవత్సరాలకు అంటే.. 2012 ఫిబ్రవరి 27న అతని కుమారుడు లచ్చు పటేల్ అలియాస్ నికోలస్ తండ్రి అస్థికలను మార్లవాయికి తీసుకువచ్చి తల్లి సమాధి పక్కన ఉన్న తండి సమాధిలో ఐక్యం చేశాడు. ప్రతిసంవత్సరం ఇక్కడి గిరిజనులు హైమన్ డార్ఫ్ వర్ధంతిని ప్రతియేటా జనవరి 11న గిరిజన సంప్రదాయం ప్రకారం నిర్వహించి గిరిజనుల అభివృద్దికోసం వారు అంధించిన సేవలను, సహకారాన్ని స్మరించుకుంటున్నారు. అయితే ఆదివాసి గిరిజనుల స్థితిగతు అధ్యయనానికి తన జీవితాన్ని అంకితం చేసి, గిరిజనుల గుండేల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఇక్కడి గిరిజనులు కోరుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: