ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పోడు భూముల పట్టాల (rails to the highlands) కోసం ఆదివాసీ గిరిజనులు (Tribal people) చేస్తున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించి అర్హులైన వారికీ పట్టాలు పంపిణి చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చక పోవడంతో గిరి పుత్రులు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే సోమవార పోడు గర్జన పేరుతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా (Protest) నిర్వహించారు. దీంతో ఆదిలాబాద్ మంచిర్యాల రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అటవీ శాఖ అధికారుల అనాలోచిత చర్యలతో..
ఇటీవల మంచిర్యాల (macherial) జిల్లా దండేపల్లి మండలం కోయ పోచగూడలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ అధికారులు పెట్టిన కేసును ఎత్తివేయాలని, పోడు భూములు చేసుకుంటున్న ఆదివాసులకు (Tribal people) వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ (ITDA) ముందు రెండు గంటలపాటు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదో రకంగా ఆదివాసులను ఇబ్బందులు పెడుతున్నారని, అటవీ శాఖ అధికారుల అనాలోచిత చర్యలతో సమస్య మరింత జటిలమవుతోందని, తమను ఇబ్బంది పెట్టే అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. అడవినే నమ్ముకుని, అటవీ (Forest) సంపదను కాపాడుతున్నఆదివాసీ గిరిజనులపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆదివాసుల అస్తిత్వం కోసం, ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు (Highlands) పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ, ఈ పోడు గర్జన సభను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
భూములకు హక్కులు కల్పించాలని..
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీలను అడివి నుండి తరిమేయాలనే ఉదేశ్యంతో టైగర్ జోన్ లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. హరితంహారం పేరు మీద అడవిని కొల్లగొట్టడం జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై చిన్న చూపు చేసి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజనుల పోడు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని తమపై ఫారెస్ట్ అధికారులు ఆగడాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఐటిడిఎ ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఆదివాసీ గిరిజనులు తరలివచ్చారు.
ఆదివాసీల ఐటీడీఏ ముట్టడితో ఐటీడీఏ ప్రాంగణం తోపాటు రోడ్డు దిగ్బందమైంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి ఆదివాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వటంతో ఆదివాసులు తమ ఆందోళనను విరమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.