• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TRAPPED COAL MINER DIED RESCUE TEAM RETRIEVED THE BODY TELANGANA RAMAGUNDAM SU

సింగరేణి బొగ్గు గనిలో విషాదం.. విధులు ముగిసే సమయంలో వెంటాడిన మృత్యువు

సింగరేణి బొగ్గు గనిలో విషాదం.. విధులు ముగిసే సమయంలో వెంటాడిన మృత్యువు

ప్రతీకాత్మక చిత్రం

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని వకీల్‌పల్లి సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. గనిలో బొగ్గు బండ కూలిన ఘటనలో ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న రాపోలు నవీన్‌కుమార్(28) మృతిచెందాడు.

  • Share this:
    పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని వకీల్‌పల్లి సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. గనిలో బొగ్గు బండ కూలిన ఘటనలో ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న రాపోలు నవీన్‌కుమార్(28) మృతిచెందాడు. మరికొందరు కార్మికులు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విధులు ముగిసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. వకీల్‌పల్లి గనిలోపలి జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో జంక్షన్ వద్ద బొగ్గు బండ కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. ఆ సమయంలో యంత్రం పక్కనే పనులు పర్యవేక్షిస్తున్న నవీన్ బొగ్గు పొరల కింద చిక్కుకుపోయాడు. పొగలో నుంచి తేరుకున్న ఆపరేటర్ సతీష్ సహా ఆరుగురు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులు అందించిన సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారు.

    గనిలో కూలిన బండ తొలగింపు పనులు చేపట్టారు. తెల్లవారుజాము వరకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శిథిలాల కింద నవీన్ విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహాన్ని అధికారులు గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 2013లో జేఎంఈటీగా సింగరేణి ఉద్యోగంలో చేరిన నవీన్ రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.

    నవీన్ మరణవార్త అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బండ కింద కూరుకుపోయిన నవీన్‌ను కాపాడుకోవలేకపోయామని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: