కొందరు విధినిర్వహణలో ఉండగా, తమకు సంబంధం లేని పనులు చేసి ఇట్టే వైరల్ అవుతుంటుంటారు. ఆ పనులకు జనాలంతా ఫిదా అతుతుంటుంటారు. నెటిజన్ల మనసును చూరగొంటుంటారు. ఇటీవల హైదరాబాద్ లో కానిస్టేబుల్ అంబులెన్స్ ముందు పరుగులు తీసి జనాల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే. అంబులెన్స్ లో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు, ఆ అంబులెన్స్ ముందు పరుగులు తీస్తూ, ట్రాఫిక్ ను తప్పిస్తూ ఆ వాహనానికి దారిచ్చాడు. ఫలితంగా ఓ ప్రాణాన్ని కాపడటంలో ప్రధాన పాత్రను పోషించాడు. నెట్టింట వైరల్ అయిన ఆ వీడియోకు పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. తాజాగా అలాంటిదో మరో ఘటన జరిగింది. విధి నిర్వహణలో ఉండగా అతడు చేసిన పనికి అంతా వావ్ అంటున్నారు. అతడి మానవత్వానికి జేజేలు పలుకుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో వన్ టౌన్ ట్రాఫిక్ కార్నర్ వద్ద ఓ ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ సిగ్నళ్లను మార్చుతూ వాహనాల రద్దీని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆ ట్రాఫిక్ కార్నర్ పాయింట్ పక్కనే ఉన్న ముురికి కాలవ వద్ద ఓ కుక్క నిలబడి అరుస్తోంది. మొదట్లో ఆ కానిస్టేబుల్ దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అదే పనిగా ఆ శునకం అరుస్తుండటంతో ఏం జరిగిందా అని అక్కడకు వెళ్లి చూశాడు. ఆ మురికి కాలవలో ఓ కుక్క పిల్ల పడి, పైకి రావడానికి నానా తిప్పలు పడుతోంది. అప్పుడు అర్థమయింది ఆ కానిస్టేబుల్ కు, పైన ఉన్నది తల్లి అనీ, బిడ్డ కోసం అది ఆరాటపడుతోందని.

మురికి గుంటలో పడిన కుక్క పిల్లను రక్షిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
అంతే, ఆ కానిస్టేబుల్ ఒక్క క్షణాన్ని కూడా ఆలస్యం చేయలేదు. దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకోలేదు. మురికి కాలవ కదా అని ఆలోచించలేదు. మురికి కాలవలోంచి ఆ కుక్క పిల్లను బయటకు తీసి తల్లి వద్దకు చేర్చాడు. తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చూపిన చొరవకు స్థానికులంతా ఫిదా అయిపోయారు. అతడిని ప్రశంసల వర్షంలో కురిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఆపద వచ్చినా, మన పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు అరుదుగా ఉంటారనీ, వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమంటూ పోస్టులు పెడుతున్నారు.
Published by:Hasaan Kandula
First published:January 24, 2021, 14:18 IST