హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth reddy: గొడ్డు చాకిరీ చేయించుకుని నిర్లక్ష్యం చేస్తావా?: కేసీఆర్​పై రేవంత్​ ఫైర్​

Revanth reddy: గొడ్డు చాకిరీ చేయించుకుని నిర్లక్ష్యం చేస్తావా?: కేసీఆర్​పై రేవంత్​ ఫైర్​

కేసీఆర్​, రేవంత్​ రెడ్డి (ఫైల్​)

కేసీఆర్​, రేవంత్​ రెడ్డి (ఫైల్​)

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ (Letter) రాశారు. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) బహిరంగ లేఖ (Letter) రాశారు. గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) సమస్యల పరిష్కారం గురించి…కేసీఆర్‌ కు లేఖ రాశారు రేవంత్‌ రెడ్డి. మీ ప్రభుత్వంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయని రేవంత్​ విమర్శించారు. వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరమన్నారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు.

  సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ వీఆర్ఏలు గత 48 రోజులుగా సమ్మె చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆ లేఖలో వివరించారు. వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రేవంత్​రెడ్డి డిమాండ్‌ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, సొంత గ్రామాల్లో వాళ్లకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్‌ఏల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించని పక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యక్ష పోరాటానికి సైతం సిద్ధమవుతోందని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

  తగినంత వేతనాలు కూడా ఇవ్వడం లేదు..

  తెలంగాణలో 23 వేల మంది వీఆర్‌ఏలు ఉంటే.. అందులో 90 శాతం బీసీలు, దళిత వర్గాల బిడ్డలే ఉన్నారని రేవంత్ అన్నారు. 2020లో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్​ఏలపై పని భారం పెరిగిందని రేవంత్‌ తెలిపారు. రాష్ట్రంలో వీఆర్‌ఏల పరిస్థితి నిర్బంధ కార్మికుల కంటే అధ్వానంగా తయారయిందని అన్నారు రేవంత్​.  ఏళ్ల తరబడి వారికి పదోన్నతులు ఇవ్వడం లేదని అన్నారు. అంతేకాకుండా తగినంతగ వేతనాలు కూడా ఇవ్వటం లేదని రేవంత్​ ఆరోపించారు. చాలీచాలని జీతాలతో జీవితాలను ఎంతో ఇబ్బందికరంగా వెల్లదీస్తున్న దుస్థితి వీఆర్​ఏలకు దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  అసెంబ్లీ సాక్షిగా..

  వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని మండిపడ్డారు రేవంత్​. అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. “ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తాం…” అంటూ ఆ సందర్భంగా హామీలు గుప్పించారని పేర్కొన్నారు.

  Telangana: రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చెయ్​.. షర్మిలకు మంత్రి సవాల్​

  ‘‘మీ హామీలను చూసి వీఆర్ఏలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని ఆశ పడ్డారు.  ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ మీరు యథావిధిగా మాటతప్పారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మీకు ఎప్పుడూ లేదు. వీఆర్ఎల విషయంలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు.ముఖ్యమంత్రి మాటకే విలువ లేదని… గత్యంతరం లేని పరిస్థితుల్లో, తమ బతుకుతెరువును కాపాడుకోవాలన్న ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్‌ఏలు సమ్మె బాట పట్టారు. సమ్మెకు దిగి శనివారం నాటికి 48 రోజులు పూర్తయింది’’ అని రేవంత్​ గుర్తుచేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hyderabad, Revanth Reddy, Vra

  ఉత్తమ కథలు