తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ పదవిపై పంచాయతీ కొనసాగుతోంది. దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తర్వాత పీసీసీ అధ్యక్షుడి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పీసీసీ పదవి ఖాళీగా ఉంది. కొత్త అధ్యక్షుడిని నియామకానికి సంబంధించి.. ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి పార్టీ ఇంచార్జి మాణికం ఠాకూర్ అభిప్రాయాలను తీసుకున్నారు. ఎవరికి పీసీసీ పగ్గాలు అప్పగించాలన్న దానిపై హైకమాండ్‌కు నివేదిక కూడా సమర్పించారు. పీసీసీ చీఫ్ రేస్‌లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంటకరెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా ఉన్నారు. ఐతే బీసీ నేతకే పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని వీహెచ్ వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమను బాస్‌గా ఊహించుకుంటున్న క్రమంలో ఈ పదవిపై కాంగ్రెస్‌లో పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ పదవిపై టాలీవుడ్ ప్రొడ్యూసర్, కమెడియన్ బండ్ల గణేష్ తన అభిప్రాయాన్ని చెప్పారు.
''రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడిపై నాకు గౌరవం ఉంది. కానీ గుండె సంబంధ వ్యాధితో బాధపడే రోగికి గుండె నిపుణుడే కావాలి. నా దృష్టిలో పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి బెస్ట్.'' అని ట్విటర్లో పేర్కొన్నారు బండ్ల గణేష్. తన అభిప్రాయాన్ని చెబుతూ ఆ ట్వీట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణికం ఠాగూర్, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు.
@RahulGandhi @priyankagandhi We have respect on every leader in the state but a cardiac patient needs a cardiology specialist and it’s Revanth Reddy who in my view is the best....@manickamtagore @revanth_anumula
— BANDLA GANESH. (@ganeshbandla) December 26, 2020
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ పేరు మార్మోగిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. తమ పార్టీ గెలవకుంటే గొంతుకోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. ఆయనపై బీభత్సమైన ట్రోల్ జరిగింది. ఆ టార్చర్‌ను తట్టుకోలేక.. ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు బండ్ల గణేష్. ఆ విషయాన్ని అందరూ మర్చిపోవాలని.. తాను ఏ పార్టీలో లేనని ఆయన పదేపే చెప్పారు. ఇకపై సినిమాలు, వ్యాపారాలే చూసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ పీసీసీ చీఫ్ పదవి గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు.
గతంలో ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన బండ్ల గణేష్.. పలు హిట్ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు మూవీ'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మళ్లీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవున్నారు. మూడు నెలల క్రితం పవన్ కల్యాణ్‌ను కలిసిన బండ్ల గణేష్.. ఆయనతో మరో ప్రాజెక్ట్‌ను చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్, గబ్బర్ సింగ్ చిత్రాలను కూడా బండ్ల గణేషే నిర్మించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Revanth reddy, Telangana, Tpcc