కొద్దిరోజులుగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలను పెద్దపులి భయం వణికిస్తోంది. తాజాగా మరోసారి పులి కనిపించడంతో.. ప్రజలు భయపడిపోతున్నారు. జిల్లాలోని పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించింది. కొందరు యువకులకు పెద్ద వాగు ప్రాంతంలో పెద్ద పులి నీరు తాగుతూ కనిపించింది. దీంతో వాళ్లు తమ సెల్ఫోన్లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు అగర్‌గూడ పెద్దవాగు ప్రాంతంలో పులి సంచారం నిజమేనని అధికారులు కూడా అంగీకరించడంతో.. పెద్దపులి సంచారం నిజమేనని తేలింది.
ఇక ఈ నెల 11న ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల విఘ్నేష్‌పై పులి దాడి చేసి చంపేసింది. ఆ పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. అయినా ఇప్పటివరకు పెద్దపులి జాడ దొరకలేదు. ఆ పులి మహారాష్ట్ర అడవుల వైపు వెళ్లిపోయి ఉంటుందని అధికారులు భావించారు. అయితే కొద్దిరోజుల క్రితం జిల్లాలోని బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై కనిపించిన పెద్ద పులి అక్కడి వారి వెంటపడటం కలకలం రేపుతోంది. రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి.. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది. పులి నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. మరో ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు.
మరోవైపు కొద్దిరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇల్లందు, గూడూరు మండలాల్లో పులి గాండ్రింపులతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఆళ్లపల్లి మండలంలోని పాతూరు, సంధిబందం గ్రామాల్లో పులి సంచారాన్ని గ్రామస్తులు, అధికారులు గుర్తించారు. అటవీప్రాంతంలోని పంటపొలాల్లో కొమరం సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఎద్దును పులి చంపితింది. అనంతరం పులి చింతగండి వాగు మీదుగా నడిచివెళ్లినట్టుగా పంజా గుర్తులను అధికారులుగుర్తించారు. ఆ గుర్తులు పులివేనని నిర్ధారించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 20 ఏళ్లలో పులి సంచరించడం ఇదేనని అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.