భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక పుష్కరవనంలో పులి సంచారం కలకలం రేపింది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలోకి పులి వచ్చిందన్న వార్తతో జనం ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది గంటల కొద్దీ ఆ ప్రాంతంలో ఆనవాళ్ల కోసం వెతికారు. ఎట్టకేలకు పులి ఆ ప్రాంతంలో సంచరించినట్టు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి వయసు, అది ఏరకమైన పులి అన్నదానిపై విశ్లేషణ చేస్తున్నారు. గోదావరి తీరం వెంట ఈ ప్రాంతమంతా పారిశ్రామికవాడగా ప్రసిద్ధి పొందింది. అటవీ ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరం ఉన్నప్పటికీ ఇక్కడికి పులి ఎలా రాగలిగింది అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి.
గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు, తనకు రోడ్డు దాటుతున్న పులి కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందించాడు. అయితే తాము వచ్చేదాకా అక్కడే ఉండాలని కోరినప్పటికీ, భయంతో ఆ యువకుడు వెళ్లిపోయాడు. దీంతో పులి కనిపించిందన్న ఖచ్చితమైన ప్రదేశం విషయంలో గందరగోళానికి గురైన అటవీశాఖాధికారులు రాత్రి పొద్దుపోయేదాకా గాలిస్తునే ఉన్నారు. జనావాసాలపై దాడిచేస్తుందేమోనన్న భయంతో ఆ ప్రాంతంలోని గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
అయితే శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించగలిగారు. ఆ ప్రాంతం నుంచి ఇరవై కిలోమీటర్లకు పైగా దూరం ఉండే పాల్వంచ అభయారణ్యం నుంచి వచ్చిందని భావిస్తున్న పులి, ఒక్కటే వచ్చిందా లేక ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖాధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వాస్తవానికి పులి కనిపించిన ప్రాంతం సారపాక పుష్కరవనం బూర్గంపాడు మండలంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐటీసీ పీఎస్పీడీ పేపర్ మిల్స్ ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు, కార్మిక కుటుంబాలు ఉంటాయి. ఇక్కడికి కొద్ది దూరంలోనే పాల్వంచ శివారుల్లో నవభారత్ ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీ, ఎన్ఎండీసీ, కేటీపీఎస్ ఇంకా పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర పరిశ్రమలున్నాయి. సింగరేణి గనుల ప్రాంతానికి కూడా ఇది పెద్ద దూరమేంకాదు. దీంతోబాటుగా దక్షిణాది అయోధ్య భద్రాచలం వెళ్లే దారి అంతా దాదాపు అటవీప్రాంతం మధ్య నుంచే ఉంటుంది. ఇది కాకుండా సారపాక క్రాస్‌రోడ్స్ నుంచి అశ్వాపురం, మణుగూరు, పినపాకలకు దారితీసే మార్గం కూడా ఇదే. అశ్వాపురంలో భారజల కేంద్రం ఉంది.
అసలే పులి.. ఆపై వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలు.. వణికిపోతున్న జనం
అయితే ఈ పులి పాల్వంచ టైగర్ శాంక్చువరీ నుంచి దారి తప్పి వచ్చినట్టా లేక ఆహారం కోసం వచ్చినట్టా అన్నదానిపై అటవీశాఖాధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎక్కడికక్కడ చెరువులు, వాగుల్లో నీళ్లు పుష్కలంగాగానే ఉన్నప్పటికీ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి గోదావరి తీరం దాకా వచ్చిందంటే.. దీనికి కారణం ఏంటన్న దానిపై అధికారుల్లో గందరగోళం నెలకొంది. కొన్ని సార్లు మేటింగ్ సమయంలోనూ పులులు ఇలా ప్రయాణిస్తూ ఉంటాయని ఓ అధికారి 'న్యూస్ 18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధికి తెలిపారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతం కావడంతో పులి అయినా ఏ ఇతర జంతువైనా దగ్గరకు వచ్చిందాకా గుర్తించలేని పరిస్థితి. దీంతో పులి మాట వినగానే ఈ ప్రాంతవాసుల్లో భయందోళనలు నెలకొన్నాయి.
కొద్ది రోజుల క్రితం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కనిపించిన పులి ఇదేనా.. లేక మరొకటా అన్న సందేహం కూడా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం, పులి ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామ అడవుల్లో పులి సంచారం సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన అటవీ అధికారులకు పాదముద్రలు, ఆనవాళ్లు కనిపించాయి. దీంతో కొత్తపులా లేక గత వారంలో కనిపించిందేనా అన్న దానిపై పరిశీలన జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Telangana, Tiger, Tiger Attack