భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇల్లందు, గూడూరు మండలాల్లో పులి గాండ్రింపులతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఆళ్లపల్లి మండలంలోని పాతూరు, సంధిబందం గ్రామాల్లో పులి సంచారాన్ని గ్రామస్తులు, అధికారులు గుర్తించారు. అటవీప్రాంతంలోని పంటపొలాల్లో కొమరం సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఎద్దును పులి చంపితింది. అనంతరం పులి చింతగండి వాగు మీదుగా నడిచివెళ్లినట్టుగా పంజా గుర్తులను అధికారులుగుర్తించారు. ఆ గుర్తులు పులివేనని నిర్ధారించారు. పులి జాడ కోసం సమీప ప్రాంతం మొత్తాన్ని అటవీశాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళ చెందుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 20 ఏళ్లలో పులి సంచరించడం ఇదేనని అధికారులు చెబుతున్నారు. పశువులను బయట కట్టేయొద్దని చెబుతున్నారు. రాత్రి పూట ప్రజలు కూడా ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. అనంతారం, దామరతోగు అటవీప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగూరు, ఇల్లెందు, ములుగు, తాడ్వాయి డివిజన్ల అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నీటి తోగులు, కుంటలతో పాటు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. కొందరు పులి గాండ్రింపులను విన్నట్టుగా అధికారులకు చెబుతున్నప్పటికీ… దాని జాడ మాత్రం దొరకడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Mahabubabad, Tiger