హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tiger Attack: తెలంగాణలో పెద్ద పులి బీభత్సం.. యువతి మృతి

Tiger Attack: తెలంగాణలో పెద్ద పులి బీభత్సం.. యువతి మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tiger Attack: పత్తి చేనులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల అనే యువతిపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా కూలీలు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

తెలంగాణలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పులులు అలజడి కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుండి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు, అటవీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి.. మరోసారి తన పంజా విసిరింది. యువతిపై పంజా విసిరి బలితీసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పత్తి చేనులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల అనే యువతిపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా కూలీలు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పులి వెనక నుంచి దాడి చేయడంతో ఎవరూ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. ఈ సంఘటనతో కొండపల్లి గ్రామస్థులు భయాందోళనతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి జాడల ఆధారంగా దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కాగా, ఈ నెల 11న దహెగాం మండలం దిగుడ గ్రామంలో ఓ పులి గిరిజన యువకుడిపై దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికే దిగుడ గ్రామంలో యువకుడిపై దాడి చేసిన పులి కోసం అటవీ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దాని జాడ లభించకపోగా పలుచోట్ల పులి ఆవుల మందపై దాడి చేయడం, బాటసారులను హడలెత్తించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇదిలా ఉంటే గతంలో యువకుడిపై దాడి చేసిన పులి, యువతిని హతమార్చిన పులి ఒక్కటేనా అని నిర్ధారణ కావాల్సి ఉంది. అసలు జిల్లాలో ఎన్ని పులులు తిరుగుతున్నాయి, అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయన్నది కూడా తెలియాల్సి ఉంది. జిల్లాలో వరుస ఘటనలతో అటవీ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

First published:

Tags: Telangana, Tiger Attack

ఉత్తమ కథలు