THREE MEMBERS DIED OF CORONA IN ONE FAMILY IN KHAMMAM VRY KMM
corona : కరోనా తగ్గుతున్నా... మూకుమ్మడి మరణాలు మాత్రం ఆగడం లేదు..ఒకే ఇంటిలో ముగ్గురు బలి..
corona :
కరోనా తగ్గుతున్నా... మూకుమ్మడి మరణాలు మాత్రం ఆగడం లేదు..ఒకే ఇంటిలో ముగ్గురు బలి..
corona : దేశవ్యాప్తంగా.. కోవిడ్-19 కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా.. ఆ వైరస్ మహమ్మారి ధాటికి కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నం అవుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు.. కుటుంబ పెద్దలను కోల్పోయిన ధీనగాధలకు కొదవేలేని పరిస్థితి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ కుటుంబం
కొద్ది రోజుల వ్యవధిలో ముగ్గురిని కోల్పోయింది. దీంతో ఆ కుటుంబం ఆవేదనకు అంతులేకుండా పోయింది.
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
కళ్లెదుటే కుటుంబంలోని ఒక్కొక్కరు దూరం అవుతుంటే మిగిలిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇంటి పెద్ద దిక్కు ను కోల్పోయి.. ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాల వేదన వర్ణణాతీతం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నేతాజీరోడ్లో నివాసం ఉండే శ్రీరాముల మురళీధర్. ఆటోడ్రైవర్. మురళితో బాటు భార్య శ్రీదుర్గ, కుమార్తెలు ఇద్దరు, మురళి తల్లి, అత్త కలసి ఒకే ఇంట్లో ఉంటారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్నకుమార్తె చదువుకుంటోంది. ఈ మధ్యకాలంలో కుటుంబం అంతా ఓ శుభకార్యానికి వెళ్లివచ్చారు. దీంతో మురళీధర్‌రావుకు, తల్లి రుక్మినమ్మకు, అత్త సావిత్రికి జ్వరం వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో టెస్ట్‌లు చేయించగా నెగెటివ్ వచ్చింది. కొద్దిరోజుల అనంతరం ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ప్రవేటు ల్యాబ్‌లో స్కానింగ్ చేయించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. మురళీధర్‌రావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఈనెల 6వ తేదీన హైదరాబాద్ తరలించారు. మురళిధర్ చికిత్స పొందుతుండగానే ఇంటిదగ్గర ఉన్న ఆయన తల్లి రుక్మినమ్మ ఈనెల 11న మృతిచెందింది.
ఈ విషయం ఆయనకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే కొద్దిరోజులకు బ్లాక్‌ఫంగస్ సోకడంతో మురళీధర్‌రావు పరిస్థితి విషమంగా మారింది. తల్లి చనిపోయిన రెండోరోజు మురళీధర్‌రావు మృతిచెందాడు. దీంతో ఆయన భార్య శ్రీదుర్గ, చిన్నకుమార్తె అర్చనలు హైదరాబాద్ వెళ్లి అంత్యక్రియలు చేసి, ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే మురళీధర్‌రావు అత్త సావిత్రి కూడా మృతిచెందడంతో ఇక కుటుంబం ఆవేదనకు అంతులేకుండా పోయింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబలోని ముగ్గురు పెద్దలను కోల్పోయి దిక్కులేని పరిస్థితుల్లో ఆ కుటుంబం చిక్కుకుంది.
కేవలం నాలుగే నాలుగు రోజుల్లో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవడంతో మిగిలిన తల్లి, ఇద్దరు కూతుళ్లకు దిక్కులేకుండా పోయింది. పైగా ఆటో నడిపి జీవనం సాగించే మురళీధర్‌కు వేరే ఆర్థిక వనరులు లేకపోవడం, సంపాదించే వ్యక్తి చనిపోవడంతో ఇక ఆ కుటుంబం పరిస్థితి దీనావస్థను తలపిస్తోంది. ఇప్పటికే భర్త ఆసుపత్రి ఖర్చుల కోసం నాలుగు లక్షలు అప్పుచేసిన భార్య, అనంతర అంత్యక్రియలకు ఇంకా మరిన్ని అప్పుల్లో కూరుకుపోయింది. ఇది ఓ కుటుంబంలో కరోనా మిగిల్చిన విషాధం.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.