తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ‘తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ ఈనెల 21 నుంచి 27 వ తారీఖు వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా యాక్షన్ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ప్రభుత్వ ఆస్తులను, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు జిల్లాలోని చర్ల, మణుగూరు అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహించాం. ఇందులో భాగంగానే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో ఒక మగ మావోయిస్టు, ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. వారి వద్ద నుంచి 01 పిస్టల్, ఒక 8ఎంఎం రైఫిల్, బ్లాస్టింగ్ సామాగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 27 వరకు జరగనున్న మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పోలీసు బలగాలు జిల్లాలోని చర్ల, మణుగూరు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారు.’ అని ఎస్పీ తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.