(కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)
ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఆదివాసి గిరిజనుల ఆరాద్య దైవాలు కొలువున్న పుణ్యస్థలాల్లో పద్మల్ పురి కాకో ఒకటి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ప్రసిద్ద నాగోబా ఆలయం మరో పుణ్యక్షేత్రం కాగా కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కోట పరందోలిలోని జంగుబాయి క్షేత్రం మరో పుణ్య క్షేత్రం. వీటిలో దేని విశిష్టత దానిదే. ఇక్కడి ఆదివాసి గిరిజనులు ఎంతో భక్తి శ్రద్దలతో ఈ దైవాలను కొలుస్తారు. అయితే దీపావళి పండుగ వచ్చిందంటేజజ ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవం పద్మల్ పురి కాకో కొలువున్న మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు సమీపంలోని పవిత్ర గోదావరి నది తీరంలో కొలువున్న పద్మల్ పురి కాకో ఆలయం సందడిగా మారుతుంది. దీపావళి రోజుల్లో పది, పదిహేను రోజులపాటు పద్మల్ పురి కాకో సన్నిధిలో కొలాహలం నెలకొని ఉంటుంది. ఇక్కడ జాతర కూడా కొనసాగుతుంది.
దక్షిణ భారత దేశంలోనే ఏకైక ఆదివాసీల శక్తి పీఠంగా వెలుగొందుతున్న పద్మల్ పురి కాకో సన్నిధికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి, ఇంకా ఒరిస్సా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ , మహారాష్ట్ర రాష్ట్రాల్లోని గిరిజన గూడాల్లోని దండారి బృందాలు ఇక్కడికి వచ్చి తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకొని వెళుతున్నారు. దీంతో గోదావరి తీరంలో సందడి నెలకొంది.
Bhadradri: నష్టాల సుడిగుండంలో బంతి పూల రైతులు.., కనీస పెట్టుబడి దక్కేనా
కాగా దీపావళి పండుగ సందర్భంగా గిరిజనులు జరుపుకునే దండారి వేడకల్లో భాగంగా చేసే గుస్సాడి నృత్యాన్ని ప్రారంభించే ముందు గిరిజనులు తమ సంప్రదాయ వాయిద్యాలైన డప్పు, తుడుం, తప్పల్, పర్రె, వెట్టె, గుమేలాలను పద్మల్ పురి కాకో సన్నిధిలో ఉంచి పూజలు చేసిన అనంతరం అమ్మవారి సన్నిధిలోనే వాటిని వాయిస్తూ తొలి నృత్యాన్ని ప్రదర్శించి వెళతారు. ఇంకా ఐదు సగల గోండు తెగకు చెందిన కొత్త కోడళ్ళు బేటింగ్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేయడం మరో ఆనవాయితీ. అంతకు ముందు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి జల పూజ చేసి పద్మల్ పురి కాకో సన్నిధికి చేరుకుంటారు. అక్కడే వంటా వార్పు చేసుకొని అమ్మవారికి చేసి నైవేద్యం సమర్పించి సామూహికంగా భోజనాలు చేసి ఉపవాస దీక్షను విరమిస్తారు.
ఇదిలా ఉంటే ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పద్మల్ పురి కాకో దేవస్థానం కమిటి ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వ పరంగా ఇక్కడ కొన్ని వసతులను కల్పిస్తే రానున్న రోజుల్లో ఇది ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని కమిటి సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసి గిరిజనుల్లోని నాలుగు, ఆరు, ఏడు సగల కు చెందిన గిరిజనులకు ఈ పద్మల్ పురి కాకో నానమ్మ అయితే, ఐదు సగల తెగ గిరిజనులకు అమ్మమ్మ అవుతుందని గోండులు చెబుతారు. గిరిజనుల మౌఖిక సాహిత్యంలో పద్మల్ పురి కాకో కు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్మల్ పురి కాకో సన్నిధికి వచ్చి మొక్కులు తీర్చుకొని వెళితే పాడి పంటలు సమృద్దిగా పండుతాయని, అందరు సుఖ: శాంతులతో ఉంటారని గిరిజనుల విశ్వాసం. అందుకే ప్రతియేట దీపావళి పండుగ రోజుల్లో ఇక్కడికి వస్తామని గిరిజనులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, Telangana