THIS IS THE TPCC CHIEF REVANTH REDDY STRATEGY BEHIND KONDA SUREKHA CANDIDATURE IN HUZURABAD BYELECTION NS
Revanth Reddy: హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీకి చెమటలు పట్టేలా రేవంత్ రెడ్డి స్కెచ్.. కొండా సురేఖను పోటీకి దించడానికి కారణాలివే..
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెంచాలని ఆయన భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని మరో సారి చాటాలని సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని సోమవారం హుజూరాబాద్ వేధికగా ప్రారంభించారు కేసీఆర్. అధినేత ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పార్టీని విజయం వైపు నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఎలాగైనా గెలిచి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే వాతావరణాన్ని తీసుకురావాలని కమలం పార్టీ సైతం సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు సైతం హుజూరాబాద్ కు మకాం మార్చి ప్రచారం సాగిస్తున్నారు. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే హుజూరాబాద్ లో ఎలక్షన్ హీట్ తారా స్థాయికి చేరింది. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయినప్పటి నుంచి కాస్త హుషారుగా ఉన్న హస్తం పార్టీ.. హుజూరాబాద్ లో మాత్రం వెనకబడింది. అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం, ముఖ్యనేతలెవరూ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి.
అయితే.. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన సైతం వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించడం వెనుక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొండా దంపతుల్లో మురళి మూన్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. సురేఖ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వారు. అయితే.. హుజూరాబాద్ లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. వారి తర్వాత స్థానంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు 28 వేలు ఉన్నాయి. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఓట్లు దాదాపుగా 18 వేల వరకు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సురేఖను బరిలోకి దించితే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లతో పాటు ఆయా సామాజిక వర్గాల వారికి చెందిన మెజారిటీ ఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చన్నది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. తద్వారా ఇప్పటి వరకు టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉన్నట్లుగా కనిపిస్తున్న పోటీని త్రిముఖ పోరుగా మార్చి గౌరవప్రదమైన ఓట్లు సాధించాలని రేవంత్ భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇంకా సురేఖ గతంలో మంత్రిగా పని చేసిన సమయంలో హుజూరాబాద్ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సురేఖను దించాలన్న నిర్ణయానికి రేవంత్ తో పాటు ఇతర సీనియర్ నేతలు సైతం వచ్చినట్లు తెలుస్తోంది. సురేఖను కాదని స్థానికంగా ఉన్న బలహీనమైన నేతలను ఎవరినైనా పోటీలోకి దించితే వారు చివరి నిమిషంలో అధికార పార్టీ ఆకర్ష్ కు లొంగి పార్టీ మారే ప్రమాదం ఉందని కూడా నేతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ లాంటి బలమైన అభ్యర్థి అయితేనే తమకు అన్ని రకాలుగా మేలు చేస్తుందని టీపీసీసీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.