అలుపెరగని స్వచ్ఛ సైనికుడు, పవర్‌లో ఉన్నా లేకపోయినా పల్లె స్వచ్ఛతే అతడి లక్ష్యం

గిరిజన కుటుంబానికి చెందిన బుచ్చిరామ్ కు వంశపారంపర్యంగా ఉన్న వ్యవసాయ భూమి తప్ప మరేమి లేదు. నేడు ప్రభుత్వం ఇస్తున్న రూ.2000 పింఛను తో జీవనం సాగిస్తున్నాడు.

news18-telugu
Updated: October 24, 2020, 5:48 PM IST
అలుపెరగని స్వచ్ఛ సైనికుడు, పవర్‌లో ఉన్నా లేకపోయినా పల్లె స్వచ్ఛతే అతడి లక్ష్యం
బుచ్చిరాం
  • Share this:
(కట్టా లెనిన్, ఆదిలాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)

ఒకప్పుడు ఆ ఊరికి ఆయన ప్రథమ పౌరుడు. కానీ ఇప్పుడు అందరిలా ఆయన కూడా ఓ సాధారణ పౌరుడు. అయినా ఊరి మీద మక్కువ, గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద తగ్గలేదు. ఊరు బాగుండాలంటే శుభ్రంగా ఉండాలి. అందుకోసం స్వచ్చ సైనికుడిగా మారి ఊరు అద్దంలా మెరిసిపోవాలని, వ్యాధులు గ్రామస్థుల దరికి చేరవద్దన్న తపనతో ప్రతిరోజు స్వచ్ఛాగ్రహం చేస్తున్నాడు. తొమ్మిది పదుల వయసులోనూ ఓ మాజీ సర్పంచ్ స్వచ్ఛ సైనికుడిలా పనిచేస్తున్నాడు. ఇంతకీ ఏంటా స్వచ్ఛాగ్రహం, ఎవరా స్వచ్చ సైనికుడు తెలుసుకోవాలనుందా? అయితే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కమ్మర్ గాం గ్రామానికి వెళ్ళాల్సిందే. కమ్మర్ గాం గ్రామానికి చెందిన పోర్తేటి బుచ్చిరామ్ ఈ గ్రామ పంచాయతీకు మూడు దశాబ్దాలపాటు సర్పంచ్ గా పనిచేశాడు. 1975 నుంచి 1980 వరకు, 1980 నుంచి 1985 వరకు, 1986 నుంచి 1990 వరకు, తర్వాత 1990 నుంచి 1995 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1996 సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీ చేయలేదు. అనంతరం మారిన రిజర్వేషన్లు కలిసిరావడం తో మళ్ళీ 2001 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు ఈ గ్రామపంచాయతికి సర్పంచ్ గా పనిచేసాడు. తదనంతరం వయసు మీదపడటం, వృద్ధాప్యం రావడంతో పాటు నేటి రాజకీయాలు కూడా తనకు పనికిరావని భావించి అప్పటి నుండి పోటి చేయలేదు.

ఏ పదవీ లేకున్నా సాధారణ పౌరుడిగా మిగిలిపోయినా తన ఉరు బాగుండాలి, ఊరి జనం బాగుండాలన్న తపన, తాప్రతయం మాత్రం ఆయనలో తగ్గలేదు. ఒంటిమీదకు వచ్చిన వయసును కూడా లెక్కచేయకుండా ముప్పై ఏళ్ళు ఎంతో పరిశుభ్రంగా ఉన్న తన గ్రామంలో ఆందరు బాగుండాలి ఊరు బాగుండాలని తపన తో స్వచ్చ సైనికుడిగా మారి గ్రామాన్ని శుభ్రంగా ఉంచే పనిలో పడ్డాడు. ప్రతి రోజు గ్రామంలో తానే స్వయంగా చెత్త ఎత్తుతూ, పిచ్చి చెట్లు పీకుతూ, ఊడుస్తూ స్వచ్చ భారత్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇతని కూతురు శేషబాయి బెజ్జూర్ జడ్పీటీసీ గా ఐదు సంవత్సరాలు పనిచేసింది. కోడలు రజిత బెజ్జూర్ ఎంపీపీగా 2007 లో పనిచేసింది. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కూడా ప్రతి రోజు ఉదయం లేచిన తర్వాత తానే స్వయంగా పరిసరాలను పరిశుభ్రత చేస్తుంటాడు బుచ్చిరాం.

గిరిజన కుటుంబానికి చెందిన బుచ్చిరామ్ కు వంశపారంపర్యంగా ఉన్న వ్యవసాయ భూమి తప్ప మరేమి లేదు. నేడు ప్రభుత్వం ఇస్తున్న రూ.2000 పింఛను తో జీవనం సాగిస్తున్నాడు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు కొందరు నాలుగు రాళ్ళు వెనుకేసుకొని డాబు, దర్పం ప్రదర్శిస్తున్నఈ రోజుల్లో మూడు దశాబ్దాలపాటు గ్రామ సర్పంచ్ గా పనిచేసినా ఎలాంటి డాబు దర్పం ప్రదర్శించకుండా నిరాడంబరంగా గ్రామ బాగుకోసం స్వచ్ఛ సైనికుడిగా మారి నిత్యం గ్రామ వీధులను శుభ్రం చేస్తున్న ఈ మాజీ సర్పంచ్ కు హేట్సాఫ్ చెప్పాల్సిందే.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 24, 2020, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading