కేంద్ర బడ్జెట్ 2023పై తెలంగాణ గంపెడు ఆశలు పెట్టుకుంది. తెలంగాణకు ఇది చివరి బడ్జెట్ కావడంతో కేంద్ర మంత్రి నిర్మలమ్మ పద్దులు ఎలా ఉంటాయనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ బడ్జెట్ కేటాయింపుల గురించి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. మరి పార్లమెంట్ లో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పలు కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని పలు సంస్థలకు కేటాయించిన నిధులను కేంద్ర మంత్రి వెల్లడించారు. సింగరేణి, గిరిజన యూనివర్సిటీలు, మణుగూరు కర్మాగారాలకు నిధులు కేటాయింపు వివరాలు దిగువన ఉన్నాయి.
సింగరేణికి రూ.1600 కోట్ల కేటాయింపు
రాష్ట్రంలోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్ల కేటాయింపు
మణుగూరు, కోటభారజల కర్మాగారాలకు రూ.1437 కోట్ల కేటాయింపు
హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.300 కోట్ల కేటాయింపు
అలాగే బీబీ నగర్ ఎయిమ్స్ కు కూడా నిధుల కేటాయింపు జరిగింది.
సాలార్ జంగ్ సహా పలు మ్యూజియాలు అభివృద్ధికి రూ.357 కోట్ల కేటాయింపు
శ్రీఅన్న పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా రీసెర్చ్ లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భాగ్యనగరంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లేటల్స్ రీసెర్చ్ సెంటర్ ను ఎక్స్ లెన్స్ గా మార్చనున్నారు.
ఎన్నికల నేపథ్యంలో బోలెడు ఆశలు..
కాగా ఈ ఏడాది తెలంగాణ , ఏపీ సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్ లో ఈ రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తారని భావించారు. అయితే ఇటు తెలంగాణ, అటు ఏపీకి కేటాయించిన నిధులపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురాలేకపోయారు. దీనిపై వారు ఏం మాట్లాడుతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా, పోలవరం ఊసే ఎత్తలేదని వైసీపీ నాయకులు అసంతృప్తి వెళ్లగక్కారు.
కర్ణాటకకు భారీగా నిధులు..
మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న కర్ణాటకపై నిర్మలమ్మ నిధుల వర్షం కురిపించారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు కేటాయించగా..కరువు, వెనుకబడిన ప్రాంతాల కోసం కేంద్రం భారీగా నిధులు సమకూర్చింది.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2022-23, Singareni, Telangana