ఇప్పట్లో కరోనా వదిలేలా లేదు.. సహజీవనం తప్పదన్న కేటీఆర్..

మంత్రి కేటీఆర్ (File)

గతంలో వారానికొకసారి యాంటీ లార్వా ఆక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

 • Share this:
  ఇప్పట్లో కరోనా వైరస్ మనల్ని వదిలిపోయే అవకాశం లేదని, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటికి కొరత ఎక్కువగా లేదని మున్సిపల్ కమిషనర్లు తెలిపారు.

  ఇప్పటికే పురపాలక శాఖ ఆరోగ్య శాఖతో కలిసి తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్‌ ఆధారంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటి నుంచే వర్షాకాలంలో రానున్న డెంగ్యూ వంటి వ్యాధుల నివారణపైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు గతంలో వారానికొకసారి యాంటీ లార్వా ఆక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రతి పట్టణంలోని మురికి కాలువలను పరిశుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ కార్యక్రమాలను ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

  ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని, పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కవచాలు మాస్కులు బ్లౌజులు లేకుండా పని చేయోద్దని సూచించారు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా పనిచేసినట్టు కన్పిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్లదే అవుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి ద్వారా రూ.830 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
  Published by:Narsimha Badhini
  First published: