(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్18 తెలుగు)
ఖమ్మం కోవిడ్ కేర్ ఆసుపత్రుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా..? టాస్క్‌ఫోర్స్ తనిఖీలు.. పర్మిషన్ రద్దులు కేవలం ఓ వర్గానికే పరిమితమా.. ? అక్కడ చికిత్స పొందుతున్న రోగుల గతేంటి..? వారిని ఏఏ ఆసుపత్రుల్లో చేర్చారు..? అసలు ఇదంతా పథకం ప్రకారమే చేస్తున్నారా అంటే అవును అవునంటున్నారు కొందరు బాధిత వైద్యులు. ఓ పద్దతి ప్రకారం ఒక వర్గానికే చెందిన వారి ఆసుపత్రులపై టాస్క్‌ఫోర్స్ పేరిట దాడులు చేయించారన్న ప్రచారం సాగుతోంది. ఇది వైద్యులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం తరపున తీసుకున్న చర్యలపై అనేక మంది వైద్యులు తమ మనోభావాలను, వేదనను సోషల్‌మీడియాలో వెల్లడిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు ఖమ్మంలోని ప్రవేటు కోవిడ్ కేర్ ఆసుపత్రులు, వైద్యులు, యాజమాన్యాలు వర్టికల్‌గా చీలిపోయి.. వారి మధ్య కోల్డ్‌వార్‌కు దారితీసిందని చెబుతున్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ సోకిన పేషంట్లకు అత్యవసర వైద్యం అందించడం, వారిని ప్రాణాపాయం నుంచి రక్షించడం లక్ష్యంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 320 బెడ్లను ఏర్పాటు చేశారు.
గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వైరస్ తాకిడికి రోజుకు వేల సంఖ్యలో వచ్చిన పాజిటివ్ పేషంట్లకు ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు లేక.. అనేక మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. దీంతో సహజంగానే కోవిడ్ కేర్ బెడ్లకోసం పోటీ నెలకొంది. ఓ వైపు ఆక్సిజన్ కొరత తీవ్రం కావడం, రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడడానికి అవసరమైన ఆక్సిజన్ నిల్వలు అందకపోవడం, నిరంతర సరఫరా లేకపోవడం, ఇంకా రెమెడిసివర్ ఇంజెక్షన్లను అందుబాటులో లేక బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్ ను రూ.70 వేలకు కొన్న ఘటనను కూడా రిపోర్ట్ అయ్యాయి. దీనికితోడు పేషంట్లకు లక్షల్లో బిల్లలు వేస్తూ పేషంట్లను పీల్చిపిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం జిల్లాల స్థాయిలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాకు చెందిన మంత్రి అధ్యక్షతన, కలెక్టర్, సీపీ, డీఎంఅండ్‌హెచ్‌వో,ఇంకా ఐఎంఏ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖమ్మంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ తీసుకుని భద్రాచలం ఐటీసీతో సంప్రదించి ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.
దీంతో నిరంతర ఆక్సిజన్ దొరికినట్లయింది. దీంతోబాటు హెటెరో డ్రగ్స్ ఛైర్మన్‌ను సంప్రదించి రెమెడిసివర్ ఇంజెక్షన్లను రోజుకు 1100 చొప్పున జిల్లాకు సరఫరా అయ్యేలా.. వాటిని రోగుల సంఖ్యను బట్టి కోటాలా ఆసుపత్రులకు అందించే ఏర్పాటు చేశారు. దీంతోబాటు ఇంకా భోజనం, ఆక్సిజన్ కాన్స్సెంట్రేటర్లను సైతం అవసరమైన మేర ఏర్పాటు చేశారు. అయితే కోవిడ్ కేర్ ఆసుపత్రుల్లో పేషంట్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వేస్తూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారన్న ఫిర్యాదులపై టాస్క్‌ఫోర్స్ తీవ్రంగా స్పందించింది. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఫిర్యాదు వచ్చినంతనే దాడులు ముమ్మరం చేసి, నిరూపణ అయిన పక్షంలో కోవిడ్‌కేర్ పర్మిషన్లు రద్దు చేసింది. అయితే ఇలా పర్మిషన్లు రద్దు అయిన విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యూర్, ప్రశాంతి, మార్వెల్, జనని చిల్డ్రన్ ఆసుపత్రి, ఇండస్, విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీబాలాజి చెస్ట్ ఆసుపత్రి, న్యూహోప్, సంకల్ప సీస్టార్ ఆసుపత్రుల అనుమతులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే రద్దు అయిన ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులను ఎక్కడికి షిఫ్ట్ చేశారు..? వారు అప్పటికే చెల్లించిన ఫీజులు, అడ్వాన్సుల సంగతేంటి..? మరలా కొత్తగా చేరిన ఆసుపత్రుల్లో ఫీజుల సంగతేంటి... అన్న దానిపై అధికారులు కసరత్తు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. వాస్తవానికి అప్పటికే ఫీజులు చెల్లించి చెల్లించి అప్పులపాలైన రోగులు మరోసారి మరో ఆసుపత్రిలో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.
దీంతోబాటుగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిన వాట్సాప్ నెంబరు 9154170960 కు ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా.. కావాలనే ఓ వర్గానికి చెందిన ఆసుపత్రులపై టాస్క్‌ఫోర్స్ పేరిట దాడులు చేసి ఇబ్బందులకు గురిచేశారన్న చర్చ నడుస్తోంది. బాధితులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే.. వాటిని జిల్లాల్లో విచారణ చేయించి, నిరూపణ అయితే చర్యలు తీసుకోవాల్సింది డైరెక్టర్ అయితే.. ఇక్కడ మాత్రం జిల్లాలోనే వత్తిడికి తలొగ్గి చర్యలకు దిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం అలాంటిది ఏం లేదు. తమకు ఫిర్యాదు రాగానే స్పందించాం అంటున్న పరిస్థితి. ఏదిఏమైనా ఇప్పటిదాకా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రవేటు ఆసుపత్రులను ఎవరేం చెయ్యలేరన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. టాస్క్‌ఫోర్స్ దాడులు చేయడం.. వెంటవెంటనే అనుమతులు రద్దు చేయడంతో ప్రైవేటు ఆసుపత్రులకు కంటగింపుగా మారింది. ఇది తాజాగా మరో రూపం తీసుకుని సోషల్‌మీడియా వేదికగా దుమారం రేగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid care, Khammam, Private hospitals, Task Force Police