Home /News /telangana /

THE YOUNG MAN ACCIDENTALLY SLIPPED AND FELL WHILE TAKING PHOTOS AT THE WATERFALL ADB VB

Telangana: ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. ఎక్కడంటే..

గల్లంతైన యువకుడు

గల్లంతైన యువకుడు

Telangana: సెల్ఫీ మోజు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర ప్రాంతంలోని జలపాతంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తుపడి మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సెల్ఫీ మోజు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర ప్రాంతంలోని జలపాతంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తుపడి మృతి చెందాడు. మహారాష్ట్రలోని రాజూరా దేవాడ గ్రామానికి చెందిన రాం విజయ్ లోబడే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి చింతల మాదారం జలపాతం అందాలను తిలకించేందుకు వచ్చాడు. అయితే జలపాతం వద్ద ఫోటో తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తిర్యాణి ఎస్.ఐ. రామారావు సిబ్బందితో హుటా హుటిన జలపాతం వద్దకు చేరుకొని స్థానిక గిరిజన యువకులతోపాటు తిర్యాణి మండల కేంద్రానికి చెందిన గజ ఈతగాళ్ళ సహాయంతో గల్లంతైన యువకుడి కోసం గాలించారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు జలపాతం అడుగు భాగంగాలో చిక్కుకుపోయి ఉన్న యువకుడి మృత దేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు.

    ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం వద్ద వరదలో చిక్కుకొని ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి పొచ్చెర జలపాతానికి వెళ్లిన జైనథ్ మండలం సాంగిడి గ్రామానికి చెందిన యువకుడు వంతెన దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి అందులో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో మరోవ్యక్తిని స్థానికులు కాపాడగలిగారు. కాగా యువకులు జలపాతాల వద్ద సెల్ఫీ మోజులోపడి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం సేవించడం, జలపాతంలో ఈత కొట్టడం వంటి చేష్టలను మానుకోవాలని, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని సూచిస్తున్నారు.

    ఇదిలా ఉంటే చింతల మాదర జలపాతం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంతోపాటు ప్రస్తుతం కరోనా, భారీ వర్షాలు, తదితర భద్రత కారణాల దృష్ట్యా చింతలమాదర గ్రామపంచాయతీ వారు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. అటు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లీంగాపూర్ మండలంలోని మిట్టే జలపాతం సందర్శనను కూడా నిలిపివేస్తున్న జైనూర్ సి.ఐ. తెలిపారు.  ఇదిలా ఉంటే నిన్న మొన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు వరద నీటితో నిండి ఉరకలు వేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతాన్ని ఆదిలాబాద్ ఎస్పి రాజేశ్ చంద్ర సందర్శించారు. పరిస్థితులను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు సిబ్బందికి సూచనలిచ్చారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు