వివాహేతర సంబంధం కట్టుకున్న భర్తను కడతేర్చేదాకా తీసుకొచ్చింది. ప్రియుడి మోజులో పడి భర్తను వద్దనుకొని, తనకున్న ఇద్దరు బిడ్డల భవిష్యత్తును కూడా మరిచిపోయి.. మద్యం మత్తులో ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమింది. భర్త శవాన్ని ప్రియుడితో కలిసి గోదారి ఇసుక మేటల్లో పూడ్చి ఏమీ తెలియనట్లుగా ఇంటికి చేరుకుంది. పది రోజుల తర్వాత తన భర్తను వితికేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి ఇద్దరు పిల్లలను తీసుకొని ప్రియుడి ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ బాగానే ఉంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మధ్య వివాదం చోటుచేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు టేకులపల్లి సీఐ బానోత్ రాజు, ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేకులపల్లి మండలంలోని బిల్లుడుతండా పంచాయతీ పానుగోతుతండాకు చెందిన అజ్మీరా రాము(35)కు మూడుతండాకు చెందిన లలితతో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. మృతుడు రాము, ఆయన భార్య లలిత మేకల వ్యాపారం చేస్తుంటారు.
వీరికి ఎర్రుపాలెం మండలం అమ్మవారిగూడేనికి చెందిన కంసాని కృష్ణతో మేకల వ్యాపారం ద్వారా పరిచయమైంది. ఇదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల భార్య ప్రవర్తనపై రాముకు అనుమానం వచ్చింది. తరచూ ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలిగించుకోవాలని భావించిన లలిత ప్రియుడితో కలిసి చంపేసేందుకు ప్లాన్చేసింది. గత నెల 15న లలిత తన అత్తను, పిల్లలను ఈర్యతండాలోని వారి బంధువుల ఇంటికి పంపించి.. దంపతులిద్దరూ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ విషయాన్ని లలిత తన ప్రియుడు కృష్ణకు ఫోన్లో తెలిపింది. ముందస్తు ప్రణాళికతో ఉన్న కృష్ణ.... భద్రాచలంలో మేకల వ్యాపారానికి వెళ్దామని... లలితను కూడా తీసుకుని రావాలని రామును ఫోన్ ద్వారా కోరాడు. దీంతో దంపతులిద్దరూ బయలుదేరారు.
ప్లాన్ప్రకారం బూర్గంపాడు దాటిన తర్వాత గోదావరి ఒడ్డున ముగ్గురూ మందు తాగారు. రాముతో కొంచెం ఎక్కువ తాగించి మత్తులో ఉండగా మెడకు తాడు బిగించి చంపేశారు. అనంతరం అక్కడే ఇసుకలో గుంత తీసి పాతిపెట్టారు. అనంతరం లలిత ఏమీ తెలియనట్లుగా ఇంటికి చేరుకుని పది రోజులపాటు ఉంది. అనంతరం కుమార్తెలను తీసుకుని ప్రియుడి దగ్గరకు వెళ్లి అక్కడ కొన్ని రోజులపాటు ఉన్నారు. ఈ నెల 8వ తేదీన రాము తల్లి లక్ష్మి తన కొడుకు, కోడలు, మనుమరాళ్లు కనిపించడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్చేసింది. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన లలితను పోలీసులు విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు టేకులపల్లి సీఐ, ఎస్సై... బూర్గంపహాడ్ సమీపంలోని ఇసుక మేటల్లో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. హత్య చేసి నెలరోజులు గడుస్తుండటంతో రాము అస్థిపంజరం లభ్యమైంది. బూర్గంపహాడ్ తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, గిర్ధావర్ అక్బర్‌బాబు పంచనామా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to murder, Bhadrari kothagudem, Crime, Crime news, Extramarital affairs, Illegal affair, Khammam, Krishna District