హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: ఒకే జిల్లాలో ఒకే సమయంలో మూడు పార్టీల లీడర్ల పాదయాత్రలు.. ఎవరి బలమెంత?

Telangana Politics: ఒకే జిల్లాలో ఒకే సమయంలో మూడు పార్టీల లీడర్ల పాదయాత్రలు.. ఎవరి బలమెంత?

ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​, వైఎస్​ షర్మిలా, భట్టీ (ఫైల్​ ఫొటోలు)

ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​, వైఎస్​ షర్మిలా, భట్టీ (ఫైల్​ ఫొటోలు)

ఆ జిల్లాలో ఒకే సమయంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. ఇది యాదృఛ్చికమే అయినా ఒకేసారి మూడు పార్టీల నేతలు పాదయాత్రలు షురూ చేయడంతో తెరాస నేతలకు ఒకింత తలనొప్పిగా మారింది.

(జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌ 18 తెలుగు, ఖమ్మం)

పాదయాత్రల (Marching) సీజన్‌ వచ్చేసింది. ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఒకే సమయంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు (leaders of three major parties) పాదయాత్రలు చేస్తున్నారు. ఇది యాదృఛ్చికమే అయినా ఒకేసారి మూడు పార్టీల నేతలు పాదయాత్రలు షురూ చేయడంతో తెరాస నేతలకు ఒకింత తలనొప్పిగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా జనంలోకి తీసుకెళ్లడంలో ఈ ప్రధాన పార్టీల నేతలు సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. యాసంగి వరి పంట కొనుగోలు దగ్గరి నుంచి దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, సంచార జాతుల సంక్షేమం.. ప్రభుత్వ పెద్దల అవినీతి, ప్రాజెక్టుల రీఇంజినీరింగ్‌ పేరిట అంచనాలు దారుణంగా పెంచడం.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సహా పలు అంశాలపై నేతలు ప్రభుత్వ వైఖరిని, వైఫల్యాన్ని కడిగిపారేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివాసుల కష్టసుఖాలపై దాదాపు అందరు నేతలు దృష్టి సారిస్తున్నారు. పలు అంశాలను టచ్‌ చేస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దునుమాడుతున్నారు. దీనికి అధికార తెరాస నుంచి ఎలాంటి ప్రతి స్పందన లేకపోవడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది. స్పందించాల్సిన స్థాయి అంశాలు కాదనా.. లేక స్పందించే పరిస్థితి లేకనా అన్నదానిపై జనంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

వైఎస్సాటీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల (YSRTP Chief YS Sharmila) ఓవైపు.. టీపీసీసీ నేత, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మరోవైపు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఇంకోవైపు.. ఒకే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్రలు (Walks) చేస్తున్నారు. కాకతాళీయమే అయినా వీరంతా ఒకేసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పబ్లిక్‌ అటెన్షన్‌ను ప్రోది చేయగలుగుతున్నారు. పలు అంశాలపై ప్రభుత్వ వైఫల్యాన్ని, ఆదివాసీ, దళిత, బడుగు బలహీన వర్గాల పట్ల తెరాస అధినేత అనుసరిస్తున్న వైఖరిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌, కేటీఆర్ టార్గెట్‌..

వైఎస్‌ షర్మిల నిత్యం తన ప్రసంగాల్లో సీఎం కేసీఆర్‌ (CM KCR), కేటీఆర్ లనే టార్గెట్‌ చేస్తున్నారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయకుండా, కేంద్రంపై నెపం మోపుతూ జనాన్న మోసం చేస్తున్నారని ప్రతి వేదిక నుంచి ఆమె దునుమాడుతున్నారు. ఇక ఏజెన్సీలో పర్యటిస్తున్న ఆమె గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. తనకు అవకాశం ఇస్తే మరోసారి రాజన్య సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తానని చెబుతున్నారు. ఆమె పాదయాత్రకు జనం అనేక చోట్ల ఎదురుచూస్తూ నీరాజనం పడుతున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టి ఇప్పటికి ఏభై రోజులు పూర్తయినా ఆమె ఉత్సాహం తగ్గలేదనే చెప్పొచ్చు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..

ఇక సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క (MLA Bhatti Vikramarka) తన నియోజకవర్గంలో చేస్తున్న పాదయాత్రకు స్పందన ఊహించని రీతిలో ఉంది. నెమ్మదిగా, ప్రతి వీధిలోనూ నడుస్తూ.. ప్రతి ఇంటిలోని వారినీ పలకరిస్తూ సాగుతున్న భట్టివిక్రమార్క పాదయాత్ర షెడ్యూల్‌ కాస్త స్లోగా సాగుతున్నా అనేక సమస్యపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. మధ్య మధ్యలో పార్టీ సమావేశాలకు హైదరాబాద్‌, ఢిల్లీలకు హాజరవుతూనే తన పాదయాత్రను సాగిస్తున్నారు. ఆయనకు తోడుగా సతీమణి నందిని మల్లు నిత్యం ఉంటున్నారు. ఇప్పటికి 26 రోజులుగా ఆయన తన నియోజకవర్గంలో యాత్ర చేస్తున్నారు.

వెనుకబాటుకు గురైన వర్గాల టార్గెట్‌..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (RS Praveen kumar) చేపట్టిన పాదయాత్రకు సైతం అనూహ్య స్పందన లభిస్తోంది. సుమారు పదేళ్లపాటు గురుకులాల సొసైటీకి కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌కు శ్వారోల నుంచి మంచి సహకారం అందుతోంది. పూర్తిగా వెనుకబాటుకు గురైన వర్గాలకు టార్గెట్‌ చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. తన పాదయాత్రను ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్‌ చేయడం వెనుక కూడా తనకు బలమైన మద్దతు శ్వారోల నుంచి లభిస్తుందన్న ఆలోచనతోనే అంటున్నారు.

రాజకీయంగా చాలా భిన్నంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాగా వేసేందుకు ఇలా రకరకాల పార్టీలు తమ పాదయాత్రలకు శ్రీకారం చుట్టాయి. మొదటి నుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లకు పెట్టని కోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా పలువురు నేతల కృషితో తెదేపా పాదుకోగలిగింది. అయినా ఏ ఎన్నికల్లో అయినా సమాన భాగాలను ఇటు తెదేపా, కాంగ్రెస్‌ (Congress), ఉభయ కమ్యూనిస్టులు పంచుకుంటూ వస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. తెరాస (TRS) అనుకున్న స్థాయిలో ఓట్లను, సీట్లను గెలవలేకపోగా, ఉభయ కమ్యూనిస్టులు సైతం వెనుకబడ్డారు. ఇక కాంగ్రెస్‌ మాత్రం అనూహ్యంగా గత ఎన్నికల్లో పది సీట్లకు  గానూ తొమ్మిది గెల్చుకుని తన పట్టును చాటుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ తన బలాన్ని నిరూపించుకుంది. ఇక ఆ పార్టీ తరపున గెలిచిన వారిలో ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మినహా అందరూ హస్తం పార్టీకి హ్యాండ్‌ ఇచ్చి కారెక్కేశారు. అయినా ఆ పార్టీ పరిస్థితి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అంతర్గతంగా వర్గాల కుమ్ములాటలుగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీలు బోణీ కొట్టాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎఫర్ట్‌ పెట్టడమే కరెక్ట్‌ అన్న భావనతోనే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. మరి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారో చూడాలి.

First published:

Tags: Bhatti Vikramarka, Khammam, Rs praveen kumar, Telangana Politics, Walking, YS Sharmila

ఉత్తమ కథలు