హైదరాబాద్లోని (Hyderabad) ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ (Cabinet) భేటీ జరిగింది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు (Asara Pensions) మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో కొత్తవి, పాతవి కలిసి 46 లక్షల పెన్షన్ దారులకు కొత్తకార్డులు అందజేయనున్నారు. ఈ కేబినేట్లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆసరా పించన్లు తీసుకునే వారికి ఓ గుర్తింపు కార్డు (Identity card) ఇవ్వనుంది. ఈ మేరకు ఓ నమూనా గుర్తింపు కార్డును సైతం పరిశీలిస్తున్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకుంది. అదే ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది
వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కేబినెట్ సమావేశానికి ముందు.. ప్రగతి భవన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మునుగోడు ఉపఎన్నికపైనే (Munugode By Elections) వారితో చర్చించారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు సీఎం కేసీఆర్. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? టికెట్ ఎవరికిస్తే గెలవచ్చు? అనే వివరాలపై ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి వచ్చినా.. అందరూ కలిసి కట్టుగా పనిచేసి.. పార్టీ విజయానికి కృషి చేయాలని నల్గొండ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 21న మునుగోడు నియోజకవర్గంలో అమిత్ షా సభ జరగనుండగా.. అంతకంటే ముందే ఆగస్టు 19నే టీఆర్ఎస్ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara pension, CM KCR, Telangana Government