దిశ నిందితుల ఎన్ కౌంటర్ (Disha case Accused Encounter) పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిర్ప్కూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఇవాళ విచారణను ప్రారంభించింది. సిర్ప్కూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు (Supreme Court )చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) వెల్లడించారు. దోషులు ఎవరో తేలిందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే అనూహ్యంగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును ప్రత్యేకంగా మానిటర్ చేయలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని కూడా సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రశ్నే లేదని కూడా సీజేఐ చెప్పారు. దిశ కేసును హైకోర్టు (Telangana High Court)కు పంపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన ప్రాయంగా తెలిపింది.
న్యాయవాది సూచనలు పరిగణనలోకి తీసుకుని..
అంతకుముందు ఈ కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు బదిలీ చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని చెప్పాలని ప్రభుత్వ అడ్వకేట్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయమై 10 నిమిషాల సమయం ఇచ్చింది. అనంతరం ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొంది. కమిషన్ నివేదికను బహిర్గతం చేస్తామని కూడా ప్రకటించింది.
నివేదిక ఎందుకు బయటపెట్టవద్దు..?
మరో వైపు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బయట పెట్టాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేసిన హక్కుల సంఘాల తరపు న్యాయవాది నివేదికను బయట పెట్టాలని కోరారు. అయితే సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గత పర్చవద్దో చెప్పాలని కూడా ధర్మాసనంలో మరో జడ్జి హిమా కోహ్లి న్యాయవాదులను ప్రశ్నించారు. అయితే ఈ రిపోర్టు బహిర్గతమైతే సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అయితే న్యాయవాదుల వాదనతో ఏకీభవించని ధర్మాసనం కమిషన్ నివేదికను బహిర్గతం చేస్తామని వెల్లడించింది.కాగా, సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన విచారణకు మాజీ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు.
కేసు ఏంటి?
2020 నవంబర్ 27న రాత్రి దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారు. షాద్ నగర్ మండలం చటాన్‌పల్లి సమీపంలో ఆమె మృతదేహాన్ని కాల్చారు. అయితే, దిశను తగులబెట్టిన చోటే డిసెంబరు 6న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ మండలం చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నలుగురు నిందితులు ప్రయత్నించారని పోలీసులు అదే రోజు వెల్లడించారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. పోలీసుల జరిగిన ఎదురుకాల్పులో వారు చనిపోయారని అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
సుప్రీంకు బాధితుల కుటుంబాలు..
దిశా కేసులో ఎన్‌కౌంటర్ కాబడ్డ నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ లేదా ఇతర ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, నష్టపరిహారం కింద తమ కుటుంబాలకు రూ.50లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని అనుసరించి.. నిందితుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించినందుకు పరిహారం కోరుతున్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్‌కి ముందు,ఆ తర్వాత.. కేసుకు సంబంధించిన మొత్తం ఫైళ్లను పరిశీలించాలని కోర్టును కోరారు. అంతేకాదు,ఎన్‌కౌంటర్‌లో సీపీ సజ్జనార్ పాత్రపై కూడా విచారణ జరిపించాలన్నారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ సెక్రటరీ,తెలంగాణ చీఫ్ సెక్రటరీ,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,ఎస్ఐ శ్రీధర్ కుమార్‌లను బాధ్యులుగా చేర్చారు. మృతులపై నమోదైన కేసులను రద్దు చేయాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha accused Encounter, Highcourt, Supreme Court, Telangana